వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుందని... చెల్లిపై కత్తితో దాడి చేసిన అన్న!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వేరే కులం యువకుడిని పెళ్లి చేసుకుందని... చెల్లిపై కత్తితో దాడి చేసిన అన్న!

  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి సమీపంలో ఘటన
  • 12 రోజుల క్రితం ఆర్యసమాజ్ లో మౌనిక, సాయి వివాహం
  • తల్లికి బాగాలేకపోవడంతో చూసేందుకు వచ్చిన మౌనిక
  • గొడవ పెట్టుకుని విచక్షణా రహితంగా దాడి చేసిన సోదరుడు
కులాంతర వివాహం చేసుకున్న తోడబుట్టిన చెల్లెలిపై దారుణంగా ప్రవర్తించాడో అన్న. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో కలకలం సృష్టించింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, వీరాపూర్ గ్రామానికి చెందిన చిట్టంపెల్లి మౌనిక తనతో పాటు డిగ్రీ చదివిన తోటపల్లికి చెందిన సొల్లు సాయి అనే యువకుడిని ప్రేమించింది. వీరిద్దరి కులాలు వేరు.

12 రోజుల క్రితం వారిద్దరూ ఆర్యసమాజ్ లో వివాహం చేసుకుని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు పోలీసులు మౌనిక తల్లిదండ్రులను పిలిచారు. అయితే, కుమార్తె చెప్పకుండా వివాహం చేసుకుందన్న మనస్తాపంతో తల్లి ఆసుపత్రి పాలుకాగా, ఆమె కోలుకున్న తరువాత కౌన్సెలింగ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు.

ఈ క్రమంలో తల్లికి బాగాలేదని తెలుసుకున్న మౌనిక, ఇంటికెళ్లి, వీరికి నచ్చజెప్పాలని భావించి, వీరాపూర్ కు వచ్చింది. ఆ సమయంలో మౌనిక సోదరుడు నాగరాజు, ఇంటి పరువు తీశావంటూ ఆమెతో గొడవ పడ్డాడు. ఇదే విషయాన్ని తన భర్త సాయికి ఆమె మెసేజ్ చేయగా, అతను దాన్ని శుక్రవారం నాడు పోలీసులకు చూపించాడు. శనివారం నాడు కౌన్సెలింగ్ కు రావాలని పోలీసులు గట్టిగా చెప్పడంతో, సోదరిపై ఆగ్రహంతో కత్తితో హత్యాయత్నం చేశాడు నాగరాజు. విచక్షణా రహితంగా ఆమె శరీరంపై తొమ్మిది సార్లు పొడిచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న మౌనికను స్థానికులు, తాతయ్య కలసి కరీంనగర్ ఆసుపత్రిలో చేర్చగా, ఇప్పుడామె పరిస్థితి విషమంగా ఉంది. నాగరాజు కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Siddipet District
Bejjanki
Mounika
Marriage
Murder Attempt

More Telugu News