బంగారం, వెండి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బంగారం, వెండి ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

Central Government key decision on gold and silver exports
  • బంగారం, వెండి ఆభరణాల ఎగుమతులపై 'డ్యూటీ డ్రాబ్యాక్' రేట్లు తగ్గింపు
  • ఎగుమతిదారుల లాభాలపై ప్రభావం చూపే అవకాశం
  • బంగారంపై 3.1%, వెండిపై 9% మేర తగ్గిన రిఫండ్
  • జులైలో ఈ రేట్లను భారీగా పెంచిన కేంద్ర ప్రభుత్వం
  • ప్రపంచ మార్కెట్లో డిమాండ్ బాగుంటే ప్రభావం తక్కువేనన్న నిపుణులు
బంగారం, వెండి ఆభరణాలతో పాటు ఇతర విలువైన లోహ ఉత్పత్తుల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం 'డ్యూటీ డ్రాబ్యాక్' రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నిర్ణయంతో నగల ఎగుమతిదారుల లాభాలపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది.

తాజా సవరణ ప్రకారం.. బంగారం ఆభరణాల ఎగుమతిపై డ్యూటీ డ్రాబ్యాక్ గ్రాముకు రూ. 1,851.99 నుంచి రూ. 1,794.11కి తగ్గింది. ఇది సుమారు 3.1 శాతం కోత. ఇక వెండి ఉత్పత్తుల విషయంలో ఈ తగ్గింపు మరింత ఎక్కువగా ఉంది. వెండి ఆభరణాలు, ఇతర వస్తువుల ఎగుమతిపై కిలోగ్రాముకు రూ. 29,501.09గా ఉన్న రేటును రూ. 26,859.02కి తగ్గించారు. ఇది దాదాపు 9 శాతం తగ్గింపును సూచిస్తోంది.

ఎగుమతి చేసే వస్తువుల తయారీకి ఉపయోగించే ముడిసరుకులపై చెల్లించిన కస్టమ్స్, ఇతర సుంకాలను ఎగుమతిదారులకు తిరిగి చెల్లించే విధానాన్నే 'డ్యూటీ డ్రాబ్యాక్' అంటారు. అంతర్జాతీయ మార్కెట్లో భారత ఉత్పత్తుల పోటీతత్వాన్ని పెంచడం దీని ముఖ్య ఉద్దేశం.

అయితే, ఈ ఏడాది జులైలో ప్రభుత్వం నగల ఎగుమతి రంగానికి ఊరటనిస్తూ డ్యూటీ డ్రాబ్యాక్ రేట్లను భారీగా పెంచింది. అప్పట్లో బంగారం ఆభరణాలపై రిఫండ్‌ను గ్రాముకు రూ. 773.17 నుంచి రూ. 1,851.99కి, వెండిపై కిలోకు రూ. 14,990.66 నుంచి రూ. 29,501.09కి పెంచింది. 

ప్రస్తుత రేట్ల తగ్గింపు నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లో డిమాండ్ బలంగా కొనసాగితే ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Advertisement
Central Government
Gold and Silver Exports
Duty Drawback Rates
Ministry of Finance
Jewellery Export Industry
Indian Export Policy

More Telugu News