నన్ను చంపేందుకు కుట్ర.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉత్తరాఖండ్ మంత్రి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను చంపేందుకు కుట్ర.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉత్తరాఖండ్ మంత్రి

Rekha Arya files police complaint against husband alleging murder plot
  • భర్త గిరిధారి లాల్ సాహుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మంత్రి రేఖా ఆర్య
  • గృహ హింస, హత్యాయత్నం, కుట్ర చేస్తున్నారని ఆరోపణ
  • తనను చంపేందుకు భర్త కుట్ర పన్నిన ఆడియో లభించిందని వెల్లడి
  • గత వివాహాన్ని దాచిపెట్టి తనను పెళ్లి చేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్న మంత్రి
  • తన పిల్లల భద్రత కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని స్పష్టీకరణ
ఉత్తరాఖండ్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రేఖా ఆర్య తన భర్త గిరిధారి లాల్ సాహుపై సంచలన ఆరోపణలు చేశారు. తనపై గృహ హింసకు పాల్పడుతున్నారని, ప్రాణహాని ఉందని, తనను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తూ డెహ్రాడూన్‌లోని కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన భర్తపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. తన మైనర్ పిల్లల భద్రతపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై మంత్రి రేఖా ఆర్య ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇటీవల తనకు లభించిన ఒక ఆడియో రికార్డింగ్ తనను తీవ్రంగా కదిలించిందని, తన వైవాహిక జీవితంలోని నిబద్ధతను ప్రశ్నించేలా చేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

"ఆ ఆడియో విన్న తర్వాత నా పిల్లల భద్రత, రక్షణ కోసం ఈ బాధాకరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మహిళలు సామాన్యులైనా, ప్రముఖులైనా గృహ హింసను సహించవద్దు. దానిపై గళం విప్పాలి" అని ఆమె పిలుపునిచ్చారు. తాను వ్యక్తిగతంగా బాధలో ఉన్నప్పటికీ, రాజ్యాంగబద్ధంగా తన విధులను నిర్వర్తిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రేఖా ఆర్య పలు కీలక విషయాలను ప్రస్తావించారు. తనకు 2004లో గిరిధారి లాల్ సాహుతో వివాహం జరిగిందని, అయితే అప్పటికే అతనికి పెళ్లై పిల్లలు ఉన్న విషయాన్ని దాచిపెట్టి తనను మోసం చేశారని ఆరోపించారు. ఈ విషయం చాలా ఏళ్ల తర్వాత తెలిసిందని, పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మౌనంగా ఉన్నానని తెలిపారు. 

ఇటీవల కాలంలో భర్త ప్రవర్తన మారిపోయిందని, ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపించారు. ఈ విషయంపై నిలదీయడంతో తనపై శారీరకంగా దాడి చేసి, దుర్భాషలాడి, చంపుతానని బెదిరించారని పేర్కొన్నారు.

ఓ మహిళతో మాట్లాడుతూ తనను హత్య చేసేందుకు భర్త కుట్ర పన్నుతున్నట్లుగా ఉన్న ఆడియో రికార్డింగ్ తనకు లభించిందని రేఖా ఆర్య ఫిర్యాదులో తెలిపారు. అంతేగాక కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి తాను వైదొలిగినట్లు తన సంతకాలను ఫోర్జరీ చేసి డాక్యుమెంట్లు సృష్టించారని కూడా ఆరోపించారు. ఈ ఆడియో, బెదిరింపుల నేపథ్యంలో తన ప్రాణాలకు, పిల్లల భద్రతకు తీవ్ర ముప్పు ఉందని, తన భర్త ఎప్పుడైనా ప్రమాదకర ఘటనకు పాల్పడవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement
Rekha Arya
Uttarakhand Minister
Girdhari Lal Sahu
Domestic Violence Complaint
Murder Conspiracy Allegations
Dehradun Police

More Telugu News