మార్నింగ్ వాక్‌లో విషాదం.. డీసీఎం ఢీకొని ఇద్దరు వాకర్ల దుర్మరణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మార్నింగ్ వాక్‌లో విషాదం.. డీసీఎం ఢీకొని ఇద్దరు వాకర్ల దుర్మరణం

Tragedy during morning walk two walkers killed after DCM hits them
  • సూర్యాపేట సమీపంలో వాకింగ్‌కు వెళ్లిన ముగ్గురిని ఢీకొట్టిన డీసీఎం
  • ఈ ఘటనలో గుర్రం సైదులు, ఆలకుంట నాగరాజు మృతి
  • తీవ్ర గాయాల పాలైన మరొకరికి ఆసుపత్రిలో చికిత్స
  • బలేంల గ్రామంలో అలముకున్న విషాద ఛాయలు
  • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
సూర్యాపేట జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జిల్లా కేంద్రానికి సమీపంలోని బలేంల స్టేజీ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎప్పటిలానే మార్నింగ్ వాక్‌కు వెళ్లిన వారిని వేగంగా వచ్చిన ఓ డీసీఎం వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బలేంల గ్రామానికి చెందిన గుర్రం సైదులు, ఆలకుంట నాగరాజు, గొల్ల జానయ్య ఈ ఉదయం నడక కోసం రోడ్డుపైకి వెళ్లారు. ఈ క్రమంలో జనగామ వైపు నుంచి సూర్యాపేట వైపు అతివేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం వీరిని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి గుర్రం సైదులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన నాగరాజు, జానయ్యలను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆలకుంట నాగరాజు మృతి చెందారు. ప్రమాదంలో ఆయన రెండు కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. తలకు బలమైన దెబ్బ తగిలిన గొల్ల జానయ్య ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో బలేంల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనాన్ని గుర్తించేందుకు, పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
Advertisement
Suryapet Road Accident
DCM Vehicle Crash
Morning Walkers Death
Balemla Village
Telangana News
Gurram Saidulu

More Telugu News