గూగుల్ కొత్త 3D ఎమోజీలు.. డిజైన్ వెనుక ఇంత కథ ఉందా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గూగుల్ కొత్త 3D ఎమోజీలు.. డిజైన్ వెనుక ఇంత కథ ఉందా?

Google New 3D Emojis The Story Behind The Design Process
  • తన కొత్త 3D నోటో ఎమోజీల డిజైన్‌ను వివరించిన గూగుల్ 
  • స్మైలీ ఎమోజీ వెనుక భాగంపై చేసిన సరదా పోస్ట్ వైరల్ 
  • 2D నుంచి 3Dకి మారడంలో ఉన్న సవాళ్లను పంచుకున్న టెక్ దిగ్గజం 
  • వాస్తవికత కన్నా భావోద్వేగ స్పష్టతకే ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడి
  • ఓపెన్ సోర్స్‌గా అందుబాటులో ఈ కొత్త 3D ఎమోజీలు 
టెక్ దిగ్గజం గూగుల్ తన కొత్త 3D నోటో ఎమోజీల డిజైన్ ప్రక్రియను వివరిస్తూ ఒక బ్లాగ్ విడుదల చేసింది. అయితే, అందులోని సాంకేతిక అంశాల కన్నా, ఒక స్మైలీ ఎమోజీకి సంబంధించిన సరదా ఉదాహరణ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 2D నుంచి 3D ఎమోజీలకు మారడంలో ఎదురయ్యే సవాళ్లను వివరిస్తూ గూగుల్ పంచుకున్న ఒక ఫొటో అందరి దృష్టినీ ఆకర్షించింది.

'360-డిగ్రీ రియాలిటీ చెక్' అనే విభాగంలో గూగుల్ ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. 2D ఐకాన్‌లు కేవలం ఒక కోణంలో కనిపిస్తే సరిపోతుందని, కానీ 3D మోడల్స్ అన్ని వైపుల నుంచి చూడటానికి వీలుగా ఉండాలని, డిజైన్‌లో ఏ లోపాన్నీ దాచలేమని పేర్కొంది. 

ఈ విషయాన్ని సరదాగా వివరించేందుకు, "ఒక స్మైలీ ఫేస్ వెనుక భాగం ఎలా ఉండాలి?" అనే ప్రశ్నను ఉదాహరణగా తీసుకుంది. ఆశ్చర్యపోతున్న ఒక పసుపు రంగు స్మైలీ ఎమోజీ తిరుగుతున్నట్టు, దాని వెనుక భాగంలో గుండ్రటి పిరుదులు ఉన్నట్టుగా ఉన్న ఫొటోలను షేర్ చేసింది. "జస్ట్ కిడ్డింగ్! బట్, ఇమాజిన్!" అని దానికి క్యాప్షన్ జోడించింది.

ఈ జోక్ పక్కన పెడితే.. కొత్త 3D ఎమోజీల రూపకల్పనలో వాస్తవికత (ఫోటోరియలిజం) కంటే భావోద్వేగాలను స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా చూపించడానికే ప్రాధాన్యమిచ్చినట్లు గూగుల్ వివరించింది. గతంలో ఉన్న కొన్ని పాత డిజైన్లలోని లోపాలను కూడా సరిదిద్దినట్లు తెలిపింది. ఉదాహరణకు పాత పూడిల్ (కుక్క) ఎమోజీలో నాలుగో కాలు కనిపించక, మూడు కాళ్లతో ఉన్నట్టుగా భ్రమ కలిగించేది. కొత్త డిజైన్‌లో ఈ సమస్యను పరిష్కరించారు.

ఈ కొత్త ఎమోజీలు 18x18 పిక్సెల్స్ వంటి చాలా చిన్న సైజులో కూడా స్పష్టంగా కనిపించేలా, డార్క్ మోడ్‌లోనూ చక్కగా పనిచేసేలా తీర్చిదిద్దారు. 'నోటో 3D' పేరుతో వస్తున్న ఈ ఎమోజీలను ప్రస్తుతం పిక్సెల్ డివైజ్‌లలో విడుదల చేస్తుండగా, త్వరలో ఇతర ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌లకూ విస్తరించనున్నారు. అంతేగాక ఈ 3D మోడల్స్‌ను ఓపెన్ సోర్స్‌గా అందుబాటులో ఉంచడం విశేషం.
Advertisement
Google
3D Emojis
Noto Emoji
Android Emoji Update
Pixel Devices
Emoji Design

More Telugu News