టైరు పంక్చర్‌.. కారు దగ్ధం.. 14 ఏళ్ల పోరాటం తర్వాత రూ.70 లక్షల బీమా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టైరు పంక్చర్‌.. కారు దగ్ధం.. 14 ఏళ్ల పోరాటం తర్వాత రూ.70 లక్షల బీమా!

Ravikanth S Patil wins 70 lakh insurance claim after 14 year legal battle for burnt BMW
  • రాత్రివేళ హైవేపై కారు టైరు పంక్చర్‌
  • సమీపంలో మెకానిక్‌ లేకపోవడంతో జాగ్రత్తగా దాబా వద్ద పార్క్‌ చేసిన పాటిల్‌
  • మరుసటి రోజు వచ్చే సరికి దగ్ధమైన కారు
  • ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌ను తిరస్కరించిన యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌
  • బీమా మొత్తంగా రూ.70 లక్షలు చెల్లించాలని ఆదేశం
రాత్రివేళ హైవేపై కారు టైరు పంక్చర్‌ అయితే ఏం చేస్తారు? సమీపంలో మెకానిక్‌ లేకపోతే వాహనాన్ని అక్కడే వదిలి వెళ్లాల్సిన పరిస్థితి రావొచ్చు. అచ్చం ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు మహారాష్ట్రకు చెందిన రవికాంత్‌ ఎస్‌.పాటిల్‌. అయితే ఆయన బీఎండబ్ల్యూ కారు మరుసటి రోజు పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. బీమా సంస్థ పరిహారం చెల్లించేందుకు నిరాకరించడంతో ఆయన 14 ఏళ్ల పాటు న్యాయపోరాటం చేశారు. చివరకు వినియోగదారుల కమిషన్‌ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. బీమా మొత్తంతో పాటు పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

2012లో ఘటన.. మరుసటి రోజు షాక్‌
2012 మార్చి 8న మహారాష్ట్రలోని ధుల్ఖేడ్‌ సమీప రాష్ట్ర రహదారిపై పాటిల్‌ ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కారు టైరు పంక్చర్‌ అయింది. సమీపంలో మరమ్మతులు చేసే వారు కనిపించకపోవడంతో రోడ్డు పక్కన ఉన్న ఓ దాబా వద్ద కారును నిలిపారు. తలుపులు, కిటికీలు భద్రంగా మూసి మరో వాహనంలో ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు తిరిగి వచ్చి చూడగా కారు పూర్తిగా దగ్ధమై కనిపించింది.

బీమా చెల్లింపునకు సంస్థ నిరాకరణ
కారు కాలిపోవడంతో బీమా పరిహారం కోసం పాటిల్‌ యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ సంస్థను ఆశ్రయించారు. అయితే, రాత్రంతా కారును నిర్లక్ష్యంగా వదిలేశారని సంస్థ అభ్యంతరం తెలిపింది. వాహనానికి మరింత నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్న నిబంధనను పాటించలేదని పేర్కొంటూ క్లెయిమ్‌ను తిరస్కరించింది.

14 ఏళ్ల తర్వాత పాటిల్‌కు న్యాయం
బీమా పాలసీలో మరమ్మతులకు గురైన వాహనాన్ని తప్పనిసరిగా రాత్రంతా కాపాడుతూ ఉండాలనే నిషేధం లేదని వినియోగదారుల కమిషన్‌ స్పష్టం చేసింది. పాటిల్‌ కారును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపి, తలుపులు, కిటికీలు మూసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారని పేర్కొంది. కారు నిర్లక్ష్యంగా వదిలేయడం వల్లే మంటలు చెలరేగాయని నిరూపించే ఆధారాలు కూడా లేవని తెలిపింది. వాహనాన్ని కాపాడటం కోసం యజమాని తన వ్యక్తిగత భద్రతను ప్రమాదంలోకి నెట్టలేరని వ్యాఖ్యానించింది.

మొత్తం రూ.70.75 లక్షలు.. వడ్డీ అదనం
పాటిల్‌కు బీమా కింద రూ.70 లక్షలు చెల్లించాలని కమిషన్‌ ఆదేశించింది. మానసిక వేదన, వేధింపులకు పరిహారంగా మరో రూ.50 వేలు, న్యాయపోరాట ఖర్చుల కింద రూ.25 వేలు ఇవ్వాలని సూచించింది. దీంతో వడ్డీ మినహా మొత్తం చెల్లించాల్సిన పరిహారం రూ.70.75 లక్షలకు చేరింది.
Advertisement
Ravikanth S Patil
United India Insurance
BMW car insurance claim
Consumer Commission ruling
Car fire insurance compensation
Maharashtra car insurance case

More Telugu News