మరోసారి చెపుతున్నా.. అధికారం జెన్‌-జీది, నాది బాల్‌ థాకరే పాత్ర: విజయసాయిరెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మరోసారి చెపుతున్నా.. అధికారం జెన్‌-జీది, నాది బాల్‌ థాకరే పాత్ర: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy says power belongs to Gen-Z and his role is like Bal Thackeray
  • కొత్త పార్టీ ఏర్పాటుపై స్పష్టత ఇచ్చిన విజయసాయిరెడ్డి
  • దసరా నాటికి పేరు, జెండా, ఎజెండా సిద్ధమవుతాయని ప్రకటన
  • రెండు కుటుంబ పార్టీలపై తిరుగుబాటే తన లక్ష్యమన్న విజయసాయి
  • గత ఎన్నికల తర్వాత వైసీపీకి దూరమైన విజయసాయి
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్‌పై మరో ప్రకటన చేశారు. ఆయన త్వరలోనే పార్టీ పెట్టబోతుండడం తెలిసిందే. అందుకు తగిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయని వెల్లడించారు. రాజకీయాల్లో తనది బాల్‌ థాకరే (శివసేన వ్యవస్థాపకుడు) వంటి పాత్రేనని, అధికారం యువతరానిదే (జెన్‌-జీ) అని తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. "పార్టీ పేరు, జెండా, ఎజెండా ఈ పవిత్ర దసరా పర్వదినాల్లో సిద్ధం అవుతున్నాయి" అని వెల్లడించారు. తాను పార్టీ పెట్టవద్దని కోరుకునే వారు చేస్తున్న చౌకబారు ప్రచారాలకు విలువివ్వాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. రాష్ట్రంలోని రెండు కుటుంబ పార్టీలపై తిరుగుబాటుగానే తన పార్టీ ఆవిర్భవిస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ప్రతి నియోజకవర్గంలో మెరికల్లాంటి కొత్త నాయకత్వాన్ని తయారు చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. "మరోసారి చెపుతున్నా... అధికారం జెన్‌-జీది, నాది బాల్‌ థాకరే పాత్ర" అని తన పోస్టులో వివరించారు.

గత సార్వత్రిక ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో విజయసాయిరెడ్డి వైసీపీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేసి, కొంతకాలం వ్యవసాయంపై దృష్టి సారించారు. ఆయన వేరే పార్టీలో చేరతారంటూ ప్రచారం జరిగినా, వాటన్నింటినీ తోసిపుచ్చుతూ సొంతంగా పార్టీ పెట్టడానికే మొగ్గు చూపారు. తాజా పోస్టుతో విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాల్లో తన తదుపరి అడుగులను ఖరారు చేసినట్టయింది.
Advertisement
Vijayasai Reddy
New Political Party
Andhra Pradesh Politics
Gen-Z Leadership
Bal Thackeray Role
AP Politics Updates

More Telugu News