సీజేఐపై వివాదాస్పద పోస్ట్.. సుమోటోగా విచారణకు సుప్రీంకోర్టులో ఫిర్యాదు

సీజేఐపై వివాదాస్పద పోస్ట్.. సుమోటోగా విచారణకు సుప్రీంకోర్టులో ఫిర్యాదు

Justice Surya Kant controversial post complaint filed in Supreme Court for Suo Motu probe
  • సీజేఐ సూర్యకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్
  • దీనిపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని వినతి
  • సుప్రీంకోర్టులో న్యాయవాది వినీత్ జిందాల్ ఫిర్యాదు
  • 'ఇండియా' కూటమి నిరసనపైనా విచారణ జరపాలని అభ్యర్థన
  • నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు నాలుగు ఎఫ్ఐఆర్‌ల నమోదు
భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్, 'ఇండియా' కూటమి సుప్రీంకోర్టు వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఈ ఘటనలపై సుమోటోగా క్రిమినల్ కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ జిందాల్, సీజేఐకి ఫిర్యాదు చేశారు.

కేరళ కాంగ్రెస్ విభాగం తన 'ఎక్స్‌' ఖాతాలో, "ప్రియమైన సూర్యకాంత్, శాంతిభద్రతలు మీ పరిధిలో లేకపోతే రాజీనామా చేయండి. ఆ పని చేయగల వారిని మేం చూసుకుంటాం" అని పోస్ట్ చేసింది. తర్వాత దానిని తొలగించినప్పటికీ, ఈ పోస్ట్ న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని జిందాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ వ్యాఖ్యలు సాధారణ రాజకీయ విమర్శల పరిధిలోకి వస్తాయా లేక కోర్టు ధిక్కరణ చట్టం 1971, సెక్షన్ 2(c) కిందకు వస్తాయా పరిశీలించాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 ప్రకారం కోర్టు ధిక్కరణను శిక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని గుర్తుచేశారు.

అలాగే, సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఇతర 'ఇండియా' కూటమి నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసే సమయంలో నిర్వహించిన నిరసన ప్రదర్శనపైనా విచారణ జరపాలని జిందాల్ అభ్యర్థించారు. ఆ సమయంలో నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించారా? భద్రతా సూచనలను అతిక్రమించారా? కోర్టు కార్యకలాపాలకు ఆటంకం కలిగించారా? అనే విషయాలను తేల్చేందుకు సీసీటీవీ ఫుటేజ్, యాక్సెస్ కంట్రోల్ లాగ్స్ వంటి ఆధారాలను పరిశీలించాలని కోరారు.

మరోవైపు, సీజేఐ రాజీనామాను కోరుతూ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్‌సీబీఏ), సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్ (ఎస్‌సీఏఓఆర్ఏ) తీవ్రంగా ఖండించాయి. ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతపై దాడి చేయడమేనని అభిప్రాయపడ్డాయి.

ఈ నిరసనలకు సంబంధించి 'భారతీయ నాగరిక్ సురక్షా సంహిత' (బీఎన్ఎస్ఎస్‌)లోని సెక్షన్ 163 కింద నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు నాలుగు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌లో రెండు, మందిర్ మార్గ్, బారాఖంబా పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు చొప్పున నమోదు చేశారు. 

ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, ఎస్‌ఐఆర్ విధానాన్ని వ్యతిరేకిస్తూ 'ఇండియా' కూటమి ఈ నిరసన చేపట్టింది. మంగళవారం ఈ అంశాన్ని సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా సుప్రీంకోర్టులో ప్రస్తావించగా, బుధవారం ప్రస్తావించాలని సీజేఐ సూచించారు.
Advertisement
Justice Surya Kant
Supreme Court of India
Kerala Congress
INDIA Alliance Protest
Contempt of Court
Vineet Jindal

More Telugu News