జంతర్‌మంతర్‌ బంద్‌.. రామ్‌లీలాలో గళం విప్పాలంటే రోజుకు రూ.1.21 లక్షలు!

జంతర్‌మంతర్‌ బంద్‌.. రామ్‌లీలాలో గళం విప్పాలంటే రోజుకు రూ.1.21 లక్షలు!

Ramlila Maidan protest costs 121 lakh per day as Jantar Mantar closes
  • రామ్‌లీలా మైదాన్‌లో ఒక్కరోజు బుకింగ్‌కు రూ.1.21 లక్షల వరకు ఖర్చు
  • ఈ ఏడాది డిసెంబరు 29, 30, 31 తేదీల్లోనే బుకింగ్‌ అవకాశం
  • ఉచిత నిరసన ప్రాంతంలో 150 మందికే అనుమతి
  • జంతర్‌ మంతర్‌ స్థానంలో మూడు కొత్త నిరసన వేదికలు
  • మైదాన్‌ బుకింగ్‌కు ఢిల్లీ పోలీసుల నిరభ్యంతర పత్రం తప్పనిసరి
ఢిల్లీలో నిరసన ప్రదర్శనలకు వేదిక మారింది. గతంలో జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనలు నిర్వహించే వారు ఇప్పుడు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే కొత్తగా కేటాయించిన రామ్‌లీలా మైదాన్‌లో నిరసన చేపట్టాలంటే భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది. రోజుకు రూ.50 వేల అద్దెతో పాటు ఇతర చెల్లింపులు కలిపి తొలిరోజే రూ.1.21 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు ఈ ఏడాదిలో డిసెంబరు 29, 30, 31 తేదీలు మినహా మైదాన్‌ అందుబాటులో లేదని అధికారులు చెబుతున్నారు.

రోజుకు రూ.50 వేల అద్దె
ఢిల్లీలోని 12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామ్‌లీలా మైదాన్‌లో సుమారు 50 వేల మంది పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఈ మైదాన్‌ బుకింగ్‌ కోసం రోజుకు రూ.50 వేలు చెల్లించాలి. అదనంగా రూ.55 వేల సెక్యూరిటీ డిపాజిట్‌ ఇవ్వాలి. ఇది తిరిగి చెల్లిస్తారు. పన్నులతో కలిపి ఒక్కరోజు బుకింగ్‌కు తొలుత రూ.1.21 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు వెల్లడించారు. మైదాన్‌లో చిన్న ప్రాంతాన్ని ఉచిత నిరసనలకు కేటాయించినా.. అక్కడ కేవలం 150 మందికే అవకాశం ఉంది.

పోలీసుల అనుమతి తప్పనిసరి
ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యానవన విభాగం ద్వారా మైదాన్‌ను బుక్‌ చేసుకోవాలి. దరఖాస్తుకు ఢిల్లీ పోలీసుల నిరభ్యంతర పత్రం తప్పనిసరి. అక్టోబరు 11న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జంతర్‌ మంతర్‌ను నిరసన వేదికల జాబితా నుంచి తొలగించారు. దాని స్థానంలో రామ్‌లీలా మైదాన్‌, బురారీ మైదాన్‌, తూర్పు ఢిల్లీలోని సీబీడీ మైదాన్‌లను కేటాయించారు. ఈ మూడు ప్రాంతాల్లో నిరసనల నిర్వహణకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను ప్రత్యేకంగా విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు.

ట్రాఫిక్‌ సమస్యలూ తప్పవు
రామ్‌లీలా మైదాన్‌ రద్దీగా ఉండే వాణిజ్య ప్రాంతంలో ఉంది. సమీపంలో మూడు ఆసుపత్రులు, మున్సిపల్‌ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. భారీ సభలు జరిగినప్పుడు చుట్టుపక్కల రహదారులపై ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతాయని అధికారులు చెబుతున్నారు. అసఫ్‌ అలీ రోడ్డులో వాహనాల రాకపోకలను వన్‌సైడ్‌గా మార్చడంతో పాటు ఇతర మార్గాల్లోనూ మళ్లింపులు చేపట్టాల్సి వస్తుంది. 2014లో ఇక్కడ జరిగిన బీజేపీ సభ కారణంగా దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరంలోని ఐటీఓ వరకు ట్రాఫిక్‌ స్తంభించిందని ఓ అధికారి గుర్తుచేశారు.

చరిత్రకు సాక్షిగా మైదాన్‌
ఒకప్పుడు చెరువుగా ఉన్న ఈ ప్రాంతాన్ని 1930 నాటికి చదును చేశారు. 1932 నుంచి ఇక్కడ రామ్‌లీలా వేడుకలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్య్రం తర్వాత శరణార్థులకు ఉపాధి కల్పించేలా 1951లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అనంతరం దేశ రాజకీయాల్లోనూ ఈ మైదాన్‌ కీలక వేదికగా నిలిచింది. 1975లో అత్యవసర పరిస్థితి ప్రకటించిన రోజున జయప్రకాశ్‌ నారాయణ్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఇక్కడ సభలో ప్రసంగించారు. 2013లో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు.
Advertisement
Ramlila Maidan
Jantar Mantar
Delhi Protests
Ramlila Maidan Booking Fee
Delhi Police NOC
Protest Venues Delhi

More Telugu News