జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు.. ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం
Add ap7am to your home Screen

జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలు.. ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం

Delhi Police sensational decision on protests at Jantar Mantar
  • జంతర్‌ మంతర్‌ వద్ద నిరసనలకు అనుమతి లేదన్న ఢిల్లీ పోలీసులు
  • ప్రత్యామ్నాయంగా మూడు స్థలాలను సూచిస్తూ ఉత్తర్వులు
  • రామ్‌లీలా మైదాన్‌, బురారీ మైదాన్‌, సీబీడీ గ్రౌండ్‌లను సూచించిన పోలీసులు
  • కమిటీ సిఫారసుల మేరకు జంతర్‌ మంతర్‌ను నిర్దేశిత నిరసన స్థలాల జాబితా నుంచి తొలగింపు
  • ప్రతిపక్షాలు, కాక్రోచ్‌ పార్టీ నిరసనల నేపథ్యంలో పోలీసుల నిర్ణయానికి ప్రాధాన్యం
దేశ రాజధానిలో నిరసనలకు చిరునామాగా ఉన్న జంతర్‌ మంతర్‌ విషయంలో ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై అక్కడ నిరసనలు నిర్వహించేందుకు అనుమతిని రద్దు చేశారు. నిరసనల కోసం ప్రత్యామ్నాయంగా మూడు ప్రాంతాలను ఎంపిక చేశారు. రామ్‌లీలా మైదాన్‌, బురారీ మైదాన్‌, తూర్పు ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్‌లను నిరసన వేదికలుగా ప్రకటించారు.

ఢిల్లీ పోలీసుల స్టాండింగ్‌ ఆర్డర్‌ నంబర్‌ ఎల్‌&ఓ/48/2026 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు జంతర్‌ మంతర్‌ను నిర్దేశిత నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించినట్లు పోలీసులు వెల్లడించారు. కొత్తగా ఎంపిక చేసిన మూడు ప్రాంతాల్లో నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించేందుకు సంబంధించిన సవరించిన మార్గదర్శకాలను విడిగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. గతంలో జారీ చేసిన 2022 ఏప్రిల్‌ 28 నాటి స్టాండింగ్‌ ఆర్డర్‌లో కొంతమేర మార్పులు చేసినట్లు పేర్కొన్నారు.

భారత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమితో పాటు కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. పైగా ఈరోజే పోలీసులను కలిసిన సీజేపీ నేతలు.. జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన ఏరోజు చేపట్టాలో పోలీసులే చెప్పాలని కోరారు. అందుకు 24 గంటల అల్టిమేటం కూడా జారీ చేశారు. ఇంతలోనే పోలీసుల నుంచి తాజా నిర్ణయం వెలువడడం గమనార్హం.

జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో భద్రతను పోలీసులు కొనసాగిస్తున్నారు. ఆదివారం పలు మార్గాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కీలక కూడళ్ల వద్ద సిబ్బందిని మోహరించి, రాకపోకలను నియంత్రించారు. అనుమతి లేకుండా గుమిగూడకుండా చర్యలు చేపట్టారు.
Advertisement
Delhi Police
Jantar Mantar protest ban
Ramlila Maidan
Burari Maidan
CBD Ground East Delhi
Cockroach Janata Party

More Telugu News