డ్రైవర్ శివ త్యాగం చిరస్మరణీయం: లోకేశ్ నివాళి
Add ap7am to your home Screen

డ్రైవర్ శివ త్యాగం చిరస్మరణీయం: లోకేశ్ నివాళి

Nara Lokesh pays tribute to RTC driver Shiva for saving 40 lives
  • గుండెపోటుతో స్టీరింగ్‌పైనే కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్
  • ప్రాణాలు పోయేముందు బస్సును ఆపి 40 మందిని కాపాడిన వైనం
  • డ్రైవర్ శివకు సెల్యూట్ అంటూ నివాళులర్పించిన లోకేశ్
  • మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వ హామీ
కాకినాడ జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ తన ప్రాణాలను పణంగా పెట్టి 40 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. తీవ్రమైన గుండెపోటు వస్తున్నప్పటికీ, అత్యంత సమయస్ఫూర్తితో బస్సును రోడ్డు పక్కన నిలిపి, స్టీరింగ్‌పైనే తుదిశ్వాస విడిచారు. కర్తవ్య నిర్వహణలో ఆయన చూపిన సాహసం అందరినీ కలిచివేసింది.

కాకినాడ ఆర్టీసీ డిపోలో దినసరి వేతన డ్రైవర్‌గా పనిచేస్తున్న జట్ల శివ (శంఖవరం మండలం, కత్తిపూడి గ్రామం), కాకినాడ నుంచి 40 మంది ప్రయాణికులతో విశాఖపట్నం వెళ్తున్నారు. తుని సమీపంలోకి రాగానే ఆయనకు ఛాతీలో తీవ్రమైన నొప్పి మొదలైంది. ఆ సమయంలో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న బస్సును చాకచక్యంగా అదుపు చేసి, రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపారు. అనంతరం స్టీరింగ్‌పైనే కుప్పకూలి మరణించారు. ప్రయాణికులు వెంటనే స్పందించి ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు.

ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా స్పందించారు. డ్రైవర్ శివ సాహసాన్ని కొనియాడుతూ ఆయనకు సెల్యూట్ చేశారు. "40 మంది ప్రాణాలను కాపాడిన ఆపద్బాంధవుడు శివ. తన ప్రాణాపాయ స్థితిలోనూ ప్రయాణికుల క్షేమమే పరమావధిగా బస్సును నిలిపిన ఆయన త్యాగం చిరస్మరణీయం" అని లోకేశ్ పేర్కొన్నారు. శివ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.
Advertisement
Jatta Shiva
Nara Lokesh
APSRTC
Kakinada
Bus Driver Heart Attack
Andhra Pradesh

More Telugu News