హైదరాబాద్ ఐటీ కంపెనీలో కలకలం.. 14 గంటల పనితో వేధింపులు!
Add ap7am to your home Screen

హైదరాబాద్ ఐటీ కంపెనీలో కలకలం.. 14 గంటల పనితో వేధింపులు!

Hyderabad IT company in turmoil over 14 hour work and harassment allegations
  • హైదరాబాద్‌ లో ఓ ఐటీ కంపెనీ మేనేజర్‌పై తీవ్రమైన వేధింపుల ఆరోపణలు
  • రోజుకు 14 గంటల పని, అనారోగ్య సమయంలోనూ ఒత్తిళ్లు
  • మహిళా ఉద్యోగుల పట్ల లింగ వివక్ష చూపుతున్నారని ఆవేదన
  • హెచ్‌ఆర్‌కు ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోవడం లేదన్న ఉద్యోగులు
హైదరాబాద్‌లోని ప్ర‌ముఖ ఐటీ సంస్థలో తీవ్రమైన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. హఫీజ్‌పేట బ్రాంచ్‌లో ఓ సీనియర్ మేనేజర్ తమను తీవ్రంగా వేధిస్తున్నారని, రోజుకు 14 గంటలకు పైగా పనిచేయిస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. లింగ వివక్ష, అనారోగ్య సమస్యలను కూడా పట్టించుకోకపోవడం వంటి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియా, సంస్థ అంతర్గత ఫోరమ్‌ల ద్వారా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

కంపెనీ సీనియర్ ప్రొక్యూర్‌మెంట్ అనలిస్ట్‌గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి లింక్డ్‌ఇన్‌లో ఈ సమస్యను ప్రస్తావించారు. అక్టోబర్ 5న తనకు ఛాతీ నొప్పి రావడంతో ఇంటికి వెళ్లేందుకు అనుమతి కోరగా, మేనేజర్ నిరాకరించారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత పానిక్ అటాక్, హైపర్‌వెంటిలేషన్‌కు గురై అత్యవసర చికిత్స తీసుకోవాల్సి వచ్చిందని, అయినప్పటికీ పనివేళల విషయంలో ఒత్తిడి కొనసాగిందని తన పోస్టులో పేర్కొన్నారు.

రోజుకు 14 గంటలకు పైగా, శనివారాల్లో కూడా పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. వేకువజామున 3 గంటల సమయంలో కూడా మహిళా ఉద్యోగులను వర్క్ అప్‌డేట్స్ కోసం ఆఫీసులోనే ఉంచిన సందర్భాలు ఉన్నాయని, ఆ సమయంలో వారి క్యాబ్‌లు ఆఫీస్ బయట వేచి ఉన్నాయని తెలిపారు. ఓ మహిళా ఉద్యోగి రుతుస్రావం కారణంగా ఆలస్యమైతే అనుమానిస్తారనే భయంతో, తాను కూర్చున్న కుర్చీపై పడిన మరకను ఫొటో తీసుకున్నారనే సంఘటన అక్కడి భయానక వాతావరణానికి అద్దం పడుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

పీరియడ్స్, మెటర్నిటీ లీవ్‌ల కారణంగా తన బృందంలో మహిళలు ఉండటానికి మేనేజర్ ఇష్టపడరని, బయో-బ్రేక్‌లను కూడా నిశితంగా గమనిస్తారని ఉద్యోగులు హెచ్‌ఆర్‌తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోపించారు. మూడు వారాల క్రితమే అంతర్గత మార్గాల ద్వారా హెచ్‌ఆర్‌ విభాగానికి పలు ఫిర్యాదులు చేసినప్పటికీ, సదరు మేనేజర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఉద్యోగులు వాపోతున్నారు. పనితీరు, ఉద్యోగ భద్రతకు సంబంధించి మేనేజర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ తీవ్రమైన ఆరోపణలపై కంపెనీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
Advertisement
Hyderabad IT Company
Toxic work culture
Workplace harassment
14 hour work shift
Gender discrimination
IT employee rights

More Telugu News