ప్రేమానంద్‌ మహరాజ్‌ ఆశ్రమంలో ఏం జరుగుతోంది?.. శిష్యుడి మృతి కేసులో ఫోన్లు, సీసీటీవీపై పోలీసుల ఫోకస్‌!

ప్రేమానంద్‌ మహరాజ్‌ ఆశ్రమంలో ఏం జరుగుతోంది?.. శిష్యుడి మృతి కేసులో ఫోన్లు, సీసీటీవీపై పోలీసుల ఫోకస్‌!

Premanand Maharaj Ashram disciple death case police focus on CCTV and mobile phones
  • రసిక్‌ దులారీ మృతి కేసులో 85 మంది వాంగ్మూలాలు నమోదు
  • ఆశ్రమంలో మొబైల్‌ ఫోన్ల వినియోగంపై ఆంక్షలపై దర్యాప్తు
  • కుటుంబం, స్నేహితులతో సంబంధాలపై పోలీసులు ఆరా
  • పాత ఫోన్‌, కొత్త సిమ్‌, కాల్‌ డేటా, చాట్స్‌ పరిశీలన
  • మానసిక ఒత్తిడి ఉందా అనే కోణంలోనూ విచారణ
ఆధ్యాత్మిక బోధనలతో సోషల్‌ మీడియాలో ఆదరణ పొందిన ప్రేమానంద్‌ మహరాజ్‌ ఆశ్రమంలో శిష్యుడు రసిక్‌ దులారీ మృతి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. సెప్టెంబరు 25న ఆశ్రమంలోని నాలుగో అంతస్తు నుంచి కిందపడి రసిక్‌ మృతిచెందిన విషయం తెలిసిందే. తొలుత దీన్ని ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. ప్రస్తుతం పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమం ఉత్తరప్రదేశ్ లోని బృందావన్ లో ఉంది.

ఆశ్రమంలో శిష్యుల మొబైల్‌ ఫోన్‌ వినియోగంపై ఉన్న నిబంధనలపై పోలీసులు దృష్టి పెట్టారు. శిష్యుడిగా చేరిన తర్వాత వ్యక్తిగత ఫోన్‌ను తీసుకుని.. ఆశ్రమం తరఫున కొత్త ఫోన్‌, సిమ్‌ కార్డు ఇచ్చేవారని సమాచారం. ఆ ఫోన్లను ఎలా ఉపయోగించేవారు? వాటిపై ఏమైనా పర్యవేక్షణ ఉండేదా? కాల్స్‌, ఇతర సమాచారాన్ని ఎక్కడ భద్రపరిచేవారు? అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

బయటివారితో శిష్యుల సంబంధాలపైనా ఆరా తీస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంతవరకు మాట్లాడేవారు? వారితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయా? రసిక్‌ తనకు ఎదురైన ఇబ్బందులు లేదా మానసిక ఒత్తిడి గురించి ఎవరితోనైనా చెప్పాడా? అనే వివరాలను కుటుంబ సభ్యులు, సన్నిహితులను అడిగి తెలుసుకుంటున్నారు.

ఆశ్రమంలో చేరకముందు రసిక్‌ జీవితం ఎలా ఉండేది? ఆ తర్వాత అతడి ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చాయా? అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. అతడి పాత ఫోన్‌, కొత్త సిమ్‌, కాల్‌ డేటా, చాట్స్‌ సహా డిజిటల్‌ ఆధారాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు.

మరోవైపు రసిక్‌ రక్త నమూనాలను ఫోరెన్సిక్‌ పరీక్షలకు పంపారు. అతడి శరీరంలో మత్తు పదార్థాలు, మందులు లేదా ఇతర ప్రభావం కలిగించే పదార్థాలు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మృతికి ముందు రసిక్‌ కదలికలకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు కూడా దర్యాప్తులో కీలకంగా మారాయి. ఉదయం 10.25 గంటల సమయంలో గది నుంచి బయటకు వచ్చినట్లు, 10.36 గంటల సమయంలో నాలుగో అంతస్తు టెర్రస్‌ నుంచి కిందపడినట్లు పోలీసులు చెబుతున్నారు. గది నుంచి బయటకు వచ్చినప్పుడు అతడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించినట్లు సమాచారం. టెర్రస్‌పై కొంతసేపు కూర్చున్న అతడు కాసేపు పడుకున్న తర్వాత లేచి నిలబడి, అనంతరం కిందపడినట్లు సీసీటీవీలో నమోదైంది.

రసిక్‌ శరీరంపై తీవ్ర గాయాలు ఉండటంతో ఆ సమయంలో అతడి శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉందనే అంశంపైనా పోలీసులు దృష్టి పెట్టారు. ఇప్పటివరకు ఈ కేసులో 85 మంది వాంగ్మూలాలను నమోదు చేసినట్లు మథుర పోలీసులు తెలిపారు.

ఎవరీ ప్రేమానంద్‌ మహరాజ్‌?
ప్రేమానంద్‌ మహరాజ్‌ అసలు పేరు అనిరుద్ధ కుమార్‌ పాండే. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ ప్రాంతంలో 1971లో జన్మించిన ఆయన చిన్న వయసులోనే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లారు. 13 ఏళ్లకే ఇంటిని విడిచిపెట్టి సన్యాస జీవితం ప్రారంభించినట్లు ఆయన ఆశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత బృందావన్‌కు చేరుకుని రాధావల్లభ సంప్రదాయంలో దీక్ష తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన శ్రీ హిత్‌ రాధా కేళి కుంజ్‌ ఆశ్రమంలో ఉంటూ భక్తులకు సత్సంగ్‌, ఆధ్యాత్మిక బోధనలు అందిస్తున్నారు. 

ప్రేమానంద్‌ మహరాజ్‌ ప్రధానంగా రాధా-కృష్ణ భక్తి, నామజపం, ప్రేమ, ఆధ్యాత్మిక జీవనం గురించి సులభమైన భాషలో చెప్పే సత్సంగ్‌లతో ప్రసిద్ధి చెందారు. ఆయన ప్రసంగాలకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ కావడంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు, భక్తులు ఏర్పడ్డారు. బృందావన్‌లోని శ్రీ హిత్‌ రాధా కేళి కుంజ్‌ ఆశ్రమం ఆయన ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం. ఇది వరాహ ఘాట్‌ ప్రాంతంలో, రమణ రేతి సమీపంలో ఉంది.
Advertisement
Premanand Maharaj
Rasik Dulari death case
Mathura Ashram investigation
Premanand Maharaj Ashram CCTV
Rasik Dulari suicide probe
Mathura police investigation

More Telugu News