స్విస్‌ అధ్యక్షుడికి మోదీ అదిరిపోయే గిఫ్ట్స్‌.. ఇండియన్‌ చీజ్‌ స్పెషల్‌!

స్విస్‌ అధ్యక్షుడికి మోదీ అదిరిపోయే గిఫ్ట్స్‌.. ఇండియన్‌ చీజ్‌ స్పెషల్‌!

Narendra Modi amazing gifts to Swiss President Indian cheese special
  • స్విస్‌ అధ్యక్షుడికి మోదీ ప్రత్యేక బహుమతులు
  • మూడు రకాల ఇండియన్‌ చీజ్‌లు గిఫ్ట్‌
  • గుల్మార్గ్‌ చీజ్‌కు సూపర్‌ గోల్డ్‌ అవార్డు
  • కశ్మీరీ వాల్‌నట్‌ వాల్‌ ప్యానెల్‌ బహూకరణ
  • భార్యకు కచ్చీ షాల్‌, సదేలీ బాక్స్‌
స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గై పార్మెలిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక బహుమతులు అందించారు. భారత్‌లో తయారైన మూడు రకాల ప్రత్యేక చీజ్‌లతో పాటు కశ్మీరీ వాల్‌ ప్యానెల్‌ను ఆయనకు బహూకరించారు. స్విట్జర్లాండ్‌ చీజ్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందగా.. భారతీయ చీజ్‌ తయారీ సంప్రదాయాన్ని పరిచయం చేసేలా ఈ బహుమతులను ఎంపిక చేశారు.

మోదీ ఇచ్చిన చీజ్‌లలో ‘గుల్మార్గ్‌’ ఫ్రెంచ్‌ స్టైల్‌ బ్రి చీజ్‌ కూడా ఉంది. మెత్తగా, క్రీమీగా ఉండే ఈ చీజ్‌ పాశ్చరైజ్డ్‌ ఆవు పాలతో తయారవుతుంది. దీనికి 2026లో బ్రెజిల్‌లో జరిగిన ‘ముండియల్‌ డో క్యూజో’ పోటీలో సూపర్‌ గోల్డ్‌ అవార్డు వచ్చింది.

మరో చీజ్ ‘కోణార్క్‌’ ఫ్రెంచ్‌ టోమ్‌ స్టైల్‌ చీజ్‌. మట్టివాసన, రుచికరమైన ఫ్లేవర్‌తో పాటు నిమ్మరసం లాంటి స్వల్ప రుచి ఉంటుంది. దీనికి 2023 వరల్డ్‌ చీజ్‌ అవార్డ్స్‌లో గోల్డ్‌, 2025లో స్విట్జర్లాండ్‌లో జరిగిన పోటీలో సిల్వర్‌ అవార్డు లభించింది.

‘యూర్‌’ స్విస్‌ గ్రూయేర్‌ స్ఫూర్తితో తయారైన మౌంటెన్‌ స్టైల్‌ చీజ్‌ కూడా మోదీ అందించిన కానుకల్లో ఉంది. దీన్ని ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు పక్వానికి తెచ్చి తయారు చేస్తారు. దీంతో ఇందులో స్వీట్‌, హెర్బల్‌ రుచులు వస్తాయి.

కశ్మీరీ వాల్‌ ప్యానెల్‌ను హిమాలయన్‌ వాల్‌నట్‌ కలపతో తయారు చేశారు. శతాబ్దాల నాటి కశ్మీరీ చెక్క శిల్పకళను ప్రతిబింబించేలా దీనిపై ప్రకృతి దృశ్యాలు, చెట్లు, మనుషులు, గుర్రాలు, బండ్లు, గ్రామీణ జీవితం వంటి ఆకృతులను చేతితో చెక్కారు.

పార్మెలిన్‌ భార్యకు గుజరాత్‌కు చెందిన కచ్చీ షాల్‌, సదేలీ బాక్స్‌ను మోదీ బహూకరించారు. ఈ బహుమతుల్లో గుజరాత్‌ నేత కళ, అలంకరణ శిల్పకళ ప్రత్యేకతలు కనిపిస్తాయి.

పార్మెలిన్‌ సోమవారం మూడు రోజుల భారత పర్యటనకు వచ్చారు. మోదీ ఆహ్వానం మేరకు చేపట్టిన ఈ పర్యటన ఆయనకు భారత్‌లో తొలి అధికారిక పర్యటన. అయితే 2026 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆయన భారత్‌కు వచ్చారు.
.
Advertisement
Narendra Modi
Guy Parmelin
Indian Cheese
Kashmiri Wall Panel
India Switzerland Relations
Kutch Shawl

More Telugu News