ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. క్యాబిన్ సిబ్బంది పాత్రపై అనుమానాలు!

ఫ్లైదుబాయ్ విమాన ఘటన.. క్యాబిన్ సిబ్బంది పాత్రపై అనుమానాలు!

flydubai flight incident and suspicions over cabin crew role
  • ఫ్లైదుబాయ్ విమానంలో భారత పైలట్ కెప్టెన్‌పై దాడి చేసిన ఒమన్ జాతీయుడైన కో-పైలట్ యత్నాన్ని భగ్నం చేసి, కో-పైలట్‌ను బంధించిన ప్రయాణికులు
  • దాడి చేసిన వ్యక్తిని విడిచిపెట్టాలని సిబ్బంది కోరడంతో ప్రయాణికుల్లో తీవ్ర అనుమానాలు
  • సిబ్బందిని నమ్మని ప్రయాణికులు.. పోలీసులకే అప్పగిస్తామని స్పష్టీకరణ
  • ప్రయాణికుల సమయస్ఫూర్తితో విమానం సురక్షితంగా ల్యాండింగ్
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళుతున్న ఫ్లైదుబాయ్ విమానంలో ఊహించని, భయానక ఘటన చోటుచేసుకుంది. విమానాన్ని కూల్చివేసే ఉద్దేశంతో కో-పైలట్, భారతీయ పైలట్‌పై గొడ్డలితో దాడికి పాల్పడగా, ప్రయాణికులు సాహసోపేతంగా ఆ యత్నాన్ని అడ్డుకున్నారు. అయితే, ఈ ఘటనలో విమాన సిబ్బంది ప్రవర్తన తీవ్ర అనుమానాలకు, కొత్త వివాదానికి దారితీసింది.

అసలేం జరిగిందంటే..
ఫ్లైదుబాయ్‌కు చెందిన ఎఫ్ జెడ్ 1073 విమానం టెల్ అవీవ్‌కు బయలుదేరిన కొద్దిసేపటికే కాక్‌పిట్‌లో కలకలం రేగింది. ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమామి, విమానాన్ని నడుపుతున్న భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై క్రాష్ యాక్స్ (విమానంలో ఉండే చిన్న గొడ్డలి)తో దాడికి తెగబడ్డాడు. విమానాన్ని కూల్చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడినా, కెప్టెన్ స్మిత్ మచ్చర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి కాక్‌పిట్ డోర్ తెరిచి సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ఆయన కేకలు విన్న ప్రయాణికులు వెంటనే స్పందించారు. వారిలో ఉన్న ఇద్దరు ఆఫ్-రోస్టర్ పైలట్లు, మరికొందరు ప్రయాణికులు కలిసి కో-పైలట్ హమామ్‌ను అడ్డుకున్నారు. అతడిని కిందికి పడేసి, ఇయర్‌ఫోన్ వైర్లతో చేతులు కట్టేసి పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పట్టుబడిన వారిలో టీవీ షో 'మేడే' చూసిన అనుభవంతో విమానాన్ని స్థిరంగా ఉంచడంలో సహాయపడిన ప్లంబర్ యానివ్ హయున్, గాయపడిన కెప్టెన్‌కు చికిత్స అందించిన దంత వైద్యుడు షోటా ముసేవ్ కూడా ఉన్నారు.

సిబ్బంది పాత్రపై అనుమానాలు
దాడి చేసిన కో-పైలట్‌ను ప్రయాణికులు బంధించిన తర్వాత అసలు నాటకీయత మొదలైంది. 'ది న్యూయార్క్ పోస్ట్' కథనం ప్రకారం, ఫ్లైదుబాయ్ క్యాబిన్ సిబ్బంది ప్రయాణికుల వద్దకు వచ్చి, దాడికి పాల్పడిన హమామ్ అల్-హమామి కట్లు విప్పి అతడిని వదిలివేయమని కోరారు. సిబ్బంది చేసిన ఈ వింత అభ్యర్థనతో ప్రయాణికులు విస్తుపోయారు. వారిపై తీవ్ర అనుమానం పెంచుకున్న ప్రయాణికులు, అందుకు నిరాకరించారు. అతడిని పోలీసులకే అప్పగిస్తామని తేల్చిచెప్పారు.

అంతేకాదు, సిబ్బందిని నమ్మని ప్రయాణికులు.. వారిని కాక్‌పిట్ సమీపంలో ఉండనీయకుండా విమానం మధ్య భాగంలో కూర్చోవాలని ఆదేశించారు. ఇది పరిస్థితి ఎంత ఉద్రిక్తంగా మారిందో తెలియజేస్తుంది. విచారణ కోసం కో-పైలట్ ప్రాణాలతో ఉండటం ముఖ్యమని భావించిన ప్రయాణికులు, అతడికి ఆక్సిజన్ మాస్క్ కూడా అందించారు. దాదాపు గంటా 40 నిమిషాల పాటు అతడిని తమ ఆధీనంలో ఉంచుకొని, విమానాన్ని సురక్షితంగా సమీపంలోని ఓ చిన్న విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు.

మొత్తం 174 మంది ప్రయాణికులు (27 మంది పిల్లలతో సహా) సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ హీరోయిజం, ప్రయాణికుల ధైర్యసాహసాలను అందరూ ప్రశంసిస్తున్నప్పటికీ.. దాడి చేసిన వ్యక్తిని విడిచిపెట్టమని సిబ్బంది ఎందుకు కోరారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనపై దర్యాప్తులో సిబ్బంది పాత్రపై కూడా విచారణ జరిపే అవకాశం ఉంది.
Advertisement
flydubai
Smith Macher
Hamam Al-Hamami
Axe attack flight
Dubai Tel Aviv flight
Cabin crew suspicion

More Telugu News