చంద్రబాబుకు ఇప్పుడు యంగ్ హార్డ్ వేర్ టీమ్ అండగా ఉంది: పాన్ ఐఐటీ సమ్మిట్ లో మంత్రి లోకేశ్
Advertisement

చంద్రబాబుకు ఇప్పుడు యంగ్ హార్డ్ వేర్ టీమ్ అండగా ఉంది: పాన్ ఐఐటీ సమ్మిట్ లో మంత్రి లోకేశ్

Nara Lokesh says Chandrababu Naidu is supported by a young hardware team at Pan IIT Summit
  • విజయవాడలో ‘పాన్ ఐఐటీ సమ్మిట్ - 2026
  • హాజరైన మంత్రి నారా లోకేశ్
  • ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని ఉద్ఘాటన 
  • చంద్రబాబు అనుభవానికి యువ ఎమ్మెల్యేల బృందం తోడైందని వెల్లడి
ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం అనే బలమైన సాఫ్ట్‌వేర్‌కు, యువతతో నిండిన చురుకైన హార్డ్‌వేర్ టీమ్ ఇప్పుడు అండగా నిలిచిందని, ఈ అరుదైన కలయికతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన ‘పాన్ ఐఐటీ సమ్మిట్ - 2026’లో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి తమ వంతు సహకారం అందిస్తామని, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీని మార్చడమే తమ ఉమ్మడి లక్ష్యమని అన్నారు.

"ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం 4.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఆయనకు ఇప్పుడు ఒక యంగ్ హార్డ్‌వేర్ టీమ్ అండగా ఉంది. మా శాసనసభ్యుల్లో 50 శాతం మంది మొదటిసారి గెలిచినవారే. 25 మంది మంత్రులలో 17 మంది తొలిసారి మంత్రులయ్యారు. అనుభవజ్ఞమైన సాఫ్ట్‌వేర్‌కు, ఈ యువ, డైనమిక్ హార్డ్‌వేర్ కలయికే నేటి ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఏ రంగంలోనైనా ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా ఉండాలన్నదే మా స్పష్టమైన విజన్" అని లోకేశ్ వివరించారు. 5 లక్షల మందికి పైగా ఐఐటీ గ్రాడ్యుయేట్లను కలిపే పాన్ ఐఐటీ సదస్సు ఏపీలో జరగడం ఆనందంగా ఉందన్నారు.

అభివృద్ధికి ‘3S’ మంత్రం

అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి భారత్‌కు ఒక దశాబ్దం చాలని, ఆ స్వర్ణ దశాబ్దం మనదే కావాలని ఆకాంక్షించిన లోకేశ్, దీనికి తమ ప్రభుత్వం ‘3S’ మంత్రాన్ని అనుసరిస్తోందని తెలిపారు. "మొదటిది స్పీడ్ (వేగం), రెండోది సర్వీస్ (సేవ), మూడోది స్టెబిలిటీ (స్థిరత్వం). ప్రజలు మాకు ఇచ్చింది ఐదేళ్ల సమయం. ఈ సమయంలోనే ఫలితాలు చూపించాలి. కేవలం ఎంఓయూలు కుదుర్చుకుని వాటిని మర్చిపోయే రకం మాది కాదు. ప్రాజెక్టులకు వాస్తవ రూపమిచ్చి ఉద్యోగాలు సృష్టించాలన్న తపన మాది. పరిశ్రమదారులను మేము ‘జాతి నిర్మాణకర్తలు’గా భావిస్తున్నాం. వారితో కలిసి పనిచేస్తూ, ప్రపంచ స్థాయి పాలన అందించడమే మా సేవా దృక్పథం. ఇక మూడోది స్థిరత్వం. మా పాలసీలు కాలపరీక్షను, రాజకీయ మార్పులను తట్టుకుని నిలబడేలా ఉంటాయి" అని ఆయన అన్నారు. ఇందుకు ఉదాహరణగా, గత కేసులన్నింటినీ AI ద్వారా విశ్లేషించి, న్యాయపరమైన చిక్కులు రాకుండా 16,000 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను చేపట్టామని గుర్తుచేశారు.

అమలుపైనే దృష్టి.. ఇవే మా నిదర్శనాలు

కేవలం కాగితాలపై హామీలు కాకుండా, వాస్తవంగా అమలవుతున్న ప్రాజెక్టుల గురించి లోకేశ్ సవివరంగా మాట్లాడారు. "ఏపీలో నమో అంటే నాయుడు జీ, మోదీజీ జోడీ. డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ప్రభుత్వం ఉండటం వల్లే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏపీని గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చాలన్న సీఎం సంకల్పంతో రిలయెన్స్ భాగస్వామ్యంతో మదనపల్లెలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’కు శంకుస్థాపన చేశాం. ఇది లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తుంది" అని తెలిపారు.

"ఇతర రాష్ట్రాల్లో దశాబ్దాలుగా నిలిచిపోయిన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టుకు కేవలం 17 నెలల్లోనే పునాది వేశాం. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని 13 నెలల్లోనే అనుమతులు సాధించి పనులు ప్రారంభించాం. దేశంలో ఎవరూ ఊహించని ధరకు స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్‌కు 300 ఎకరాలు కేటాయించాం. మారిటైమ్ డ్రోన్లు తయారుచేసే సాగర్ డిఫెన్స్ సంస్థకు ఫిషింగ్ హార్బర్‌లో స్థలం ఇవ్వగా, 18 నెలల్లో ఆ సంస్థ విలువ రూ.3,000 కోట్ల నుంచి రూ.23,000 కోట్లకు పెరిగింది. ఇదే మా ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం" అని లోకేశ్ పేర్కొన్నారు.

23 క్లస్టర్ల ఏర్పాటు.. అమరావతిపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో హార్టికల్చర్ నుంచి క్వాంటం కంప్యూటింగ్ వరకు 23 పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నామని, రెన్యువబుల్ ఎనర్జీలో ఏడాదిలోనే 4.8 గిగావాట్ల సామర్థ్యాన్ని జోడించామని లోకేశ్ వెల్లడించారు. అమరావతి నిర్మాణంపై మాట్లాడుతూ, "మీరు అమరావతికి వస్తే, నిర్మాణంలో ఉన్న ఒక ఆధునిక నగరం కనిపిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ నార్మన్ ఫాస్టర్ డిజైన్లతో అసెంబ్లీ, సచివాలయం వంటివి నిర్మిస్తున్నాం. ఇక్కడ 5,000 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మించబోతున్నాం. హైదరాబాద్ అభివృద్ధిలో శంషాబాద్ విమానాశ్రయం పోషించిన పాత్రను ఇది పోషిస్తుంది" అని అన్నారు.

ఐఐటీయన్లకు రెండు విజ్ఞప్తులు

ఈ సందర్భంగా పాన్ ఐఐటీ కమ్యూనిటీకి లోకేశ్ రెండు విజ్ఞప్తులు చేశారు. "మొదటిది, ప్రపంచాన్ని జయించిన మీ గ్రాడ్యుయేట్ల పరిజ్ఞానాన్ని, మార్గదర్శకత్వాన్ని మా 23 క్లస్టర్ల అభివృద్ధికి అందించాలి. రెండోది, ‘జుగాడ్’ మోడల్ నుంచి ‘వ్యవస్థీకృత వేగం’ వైపు ఏపీ ప్రయాణించడానికి, ఏఐ సాయంతో మెరుగైన పాలన అందించడానికి మీరంతా సహకరించాలి. ఇతర దేశాల మోడళ్ల గురించి మాట్లాడటం కాదు, భారత్ ఏం చేయగలదో ప్రపంచానికి చూపించాలి. అందుకు ఆంధ్రప్రదేశ్‌ను ఒక ఆదర్శంగా నిలపాలనుకుంటున్నాం" అని లోకేశ్ తన ప్రసంగాన్ని ముగించారు.
Advertisement
Nara Lokesh
Chandrababu Naidu
Pan IIT Summit 2026
Andhra Pradesh Development
IT Minister Nara Lokesh
Amaravati Capital City

More Telugu News