ఉచ్చు బిగిస్తున్న ఈడీ.. వివేకా హత్య కేసులో కీలక పరిణామం
Advertisement

ఉచ్చు బిగిస్తున్న ఈడీ.. వివేకా హత్య కేసులో కీలక పరిణామం

YS Avinash Reddy gets ED notice in Viveka murder case money laundering probe
  • వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు
  • ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని స్పష్టీక‌ర‌ణ‌
  • రూ.40 కోట్ల డీల్‌పై మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు
  • గతంలో అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు స్వాధీనం చేసుకున్న అధికారులు
  • సీబీఐ ఛార్జిషీట్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేసిన ఈడీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ), కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అక్టోబర్ 14న హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఈ కేసులో రూ.40 కోట్ల డీల్ జరిగిందనే ఆరోపణలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది.

వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్, ఛార్జిషీట్ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. 2025 ఆగస్టులో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేసింది. హత్య కోసం కుట్రదారులు సమకూర్చాలనుకున్న రూ.40 కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలనుకున్నారు? అంత పెద్ద మొత్తాన్ని వారికి ఎవరు అందించారు? అనే కోణంలో ఈడీ ఆరా తీస్తోంది. 

అలాగే, హత్యలో పాల్గొన్న నిందితులకు అడ్వాన్స్‌గా ఇచ్చిన రూ.4 కోట్ల నగదు మూలాలపై కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. 2019 నుంచి నిందితులు, అనుమానితుల బ్యాంకు లావాదేవీలు, నిధుల కదలికలపై నిశితంగా పరిశీలిస్తోంది.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ ఇప్పటికే పలువురిని విచారించింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరితో పాటు ఇతర నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలను ప్రశ్నించి వారి నుంచి కీలక వివరాలు సేకరించింది. దీనికి కొనసాగింపుగా గతంలో ఆగస్టు 21న హైదరాబాద్, కడప జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. 

ఈ సోదాల్లో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలో లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదుతో పాటు రెండు లాకర్ల తాళాలు, కొన్ని కీలకమైన దస్త్రాలను కూడా అప్పట్లో సేకరించారు.

గత సోదాల్లో లభించిన ఆధారాలు, ఇతర నిందితుల విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగానే తాజాగా అవినాష్ రెడ్డిని ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. వివేకా హత్యకు ముందు, ఆ తర్వాత జరిగిన ఆర్థిక లావాదేవీలు, నిధుల మళ్లింపు మార్గాలపై అవినాష్ రెడ్డి నుంచి వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఈ పరిణామంతో వివేకా హత్య కేసులో దర్యాప్తు మరోసారి కీలక దశకు చేరుకుంది.
Advertisement
YS Avinash Reddy
YS Vivekananda Reddy murder case
Enforcement Directorate ED notice
Money laundering investigation
Kadapa MP YS Avinash Reddy
PMLA case Hyderabad

More Telugu News