భారత రైల్వేలో సరికొత్త ప్రయోగం.. పట్టాలెక్కిన తొలి ఎల్ఎన్‌జీ రైలు.. దీని ప్రత్యేకత ఏంటంటే?
Advertisement

భారత రైల్వేలో సరికొత్త ప్రయోగం.. పట్టాలెక్కిన తొలి ఎల్ఎన్‌జీ రైలు.. దీని ప్రత్యేకత ఏంటంటే?

Indian Railways launches first LNG train and here are its special features
  • భారతదేశపు తొలి ఎల్ఎన్‌జీ ఆధారిత రైలు సేవలు ప్రారంభం
  • అహ్మదాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా
  • డ్యూయల్-ఫ్యూయల్ సిస్టమ్‌తో పనిచేయడం దీని ప్రత్యేకత  
  • డీజిల్‌తో పాటు ఎల్ఎన్‌జీ వాడకంతో 40శాతం ఇంధనం ఆదా అంచనా
  • హైడ్రోజన్ రైలుకు భిన్నమైన టెక్నాలజీతో ఈ రైలు రూపకల్పన
భారతీయ రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. దేశంలోనే తొలిసారిగా ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్‌జీ)తో నడిచే రైలును ప్రవేశపెట్టారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న సబర్మతి రైల్వే స్టేషన్‌లో ఈ నెల‌ 27న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. సబర్మతి నుంచి మెహసానా మధ్య ఈ రైలు తన తొలి ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది.

ఈ రైలు ఎనిమిది కోచ్‌లు కలిగిన డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డీఈఎంయూ) ర్యాక్. దీని ప్రత్యేకత డ్యూయల్-ఫ్యూయల్ సిస్టమ్‌తో పనిచేయడం. ఈ రైలుకు ఉన్న రెండు 1,400 హార్స్‌పవర్ సామర్థ్యం గల డ్రైవింగ్ పవర్ కార్లను (ఇంజిన్లు) డీజిల్‌తో పాటు ఎల్ఎన్‌జీతో కూడా నడిచేలా మార్పులు చేశారు. 

ఇంధన లభ్యత, అవసరాన్ని బట్టి డీజిల్ లేదా ఎల్ఎన్‌జీల మధ్య ఇంజిన్‌ను మార్చుకునే సౌలభ్యం దీనిలో ఉంది. ప్రతి పవర్ కారులో 2,200 లీటర్ల సామర్థ్యమున్న ప్రత్యేక ఇన్సులేటెడ్ ఎల్ఎన్‌జీ ట్యాంక్‌ను అమర్చారు. ఇది అత్యంత శీతల ఉష్ణోగ్రతల్లో ఇంధనాన్ని సురక్షితంగా నిల్వ చేస్తుంది.

ఈ డ్యూయల్ ఫ్యూయల్ విధానం ద్వారా డీజిల్ వాడకాన్ని దాదాపు 40 శాతం వరకు తగ్గించవచ్చని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రయల్ రన్స్‌లో వెల్లడైన వివరాల ప్రకారం, ఒక్కో డ్రైవింగ్ పవర్ కారుకు ఏటా సుమారు రూ.11.9 లక్షల వరకు ఇంధన ఖర్చు ఆదా అయ్యే అవకాశం ఉంది. ఈ రైలును అధికారికంగా ప్రారంభించడానికి ముందు 2,000 కిలోమీటర్లకు పైగా క్షేత్రస్థాయిలో విజయవంతంగా పరీక్షించారు.

అయితే, ఎల్ఎన్‌జీ కూడా శిలాజ ఇంధనమే కావడంతో ఇది పూర్తిస్థాయిలో కాలుష్యరహిత రైలు కాదు. కానీ, విద్యుదీకరణ పూర్తికాని మార్గాల్లో డీజిల్ వాడకాన్ని, నిర్వహణ ఖర్చులను తగ్గించడం, కర్బన ఉద్గారాలు, నైట్రోజన్ ఆక్సైడ్‌ల విడుదలను నియంత్రించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. 

ఇటీవల ప్రవేశపెట్టిన హైడ్రోజన్ రైలుకు, ఈ ఎల్ఎన్‌జీ రైలుకు సాంకేతికంగా కీలకమైన వ్యత్యాసం ఉంది. హైడ్రోజన్ రైలులో ఫ్యూయల్ సెల్స్ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి నడిపిస్తే, ఈ ఎల్ఎన్‌జీ రైలులో మాత్రం సంప్రదాయ ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్‌నే డ్యూయల్ ఫ్యూయల్ కోసం మార్పులు చేసి వినియోగిస్తున్నారు.
Advertisement
Indian Railways
Amit Shah
LNG Train
Sabarmati Railway Station
Dual Fuel System
Clean Energy Transport

More Telugu News