వివేకా హత్యతో లబ్ధి పొందింది వీరే: సునీల్ యాదవ్

వివేకా హత్యతో లబ్ధి పొందింది వీరే: సునీల్ యాదవ్

Sunil Yadav sensational allegations on beneficiaries of Viveka murder
  • వివేకా హత్యతో జగన్ కుటుంబానికే లబ్ధి అన్న సునీల్ యాదవ్
  • హత్యతో సంబంధం ఉన్నవారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్
  • ఈడీ విచారణ తర్వాత సంచలన ఆరోపణలు
  • తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
  • తండ్రిని చంపాల్సిన అవసరం సునీతకు లేదని వ్యాఖ్య
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ హత్య ద్వారా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య వైఎస్‌ భారతి, ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి సహా పలువురు లబ్ధి పొందారని, వారికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశాడు. రూ.40 కోట్ల సుపారీ వ్యవహారంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు హాజరైన అనంతరం, సునీల్ యాదవ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

"వివేకా హత్య వల్ల ఎవరు ప్రయోజనం పొందారో పులివెందులలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతారు. జగన్‌, ఆయన భార్య భారతి, భాస్కర్‌రెడ్డి, ఎంపీ అవినాశ్‌ రెడ్డి, శివశంకర్‌ రెడ్డి ఈ హత్యతో లబ్ధి పొందారు" అని సునీల్ యాదవ్ ఆరోపించాడు. తాము ఏ తప్పు చేయలేదని చెబుతున్న వారు విచారణను ఎందుకు ఎదుర్కోవడం లేదని ఆయన ప్రశ్నించాడు. వివేకానందరెడ్డి బతికి ఉంటే ఆయనే కడప ఎంపీ అయ్యేవారని, అందుకే ఆయనను అడ్డుతొలగించుకోవడానికి ఈ హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నాడు.

తాను నిర్దోషినని, వివేకా బతికి ఉంటే తనను యాదవ కార్పొరేషన్ ఛైర్మన్‌ను చేసేవారని సునీల్ యాదవ్ తెలిపాడు. కన్న తండ్రిని చంపాల్సిన అవసరం కుమార్తె సునీతకు కానీ, అల్లుడికి కానీ లేదని ఆయన స్పష్టం చేశాడు. తాను బతికి ఉంటేనే ఈ కేసులోని అసలు నిజాలు బయటకు వస్తాయని, ప్రస్తుతం తనకు ప్రాణహాని ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తనకు తక్షణమే రక్షణ కల్పించాలని కోరాడు. ఏపీ హోంమంత్రి అపాయింట్‌మెంట్ లభిస్తే, ఆమెను స్వయంగా కలిసి మరిన్ని కీలక వివరాలు వెల్లడిస్తానని సునీల్ యాదవ్ పేర్కొన్నాడు.
Advertisement
Sunil Yadav
YS Vivekananda Reddy murder case
YS Jagan Mohan Reddy
YS Avinash Reddy
Enforcement Directorate investigation
Andhra Pradesh politics

More Telugu News