భారతీయులకు తప్పని అమెరికా వీసా కష్టాలు.. ఏడాదికి పైగా నిరీక్షణ!

భారతీయులకు తప్పని అమెరికా వీసా కష్టాలు.. ఏడాదికి పైగా నిరీక్షణ!

US Visa delays for Indians over a year wait time
  • యూఎస్ విజిటర్ వీసా ఇంటర్వ్యూ కోసం సగటున 346 రోజుల నిరీక్షణ
  • కరోనా మహమ్మారికి ముందుతో పోలిస్తే ఇది ఎనిమిది రెట్లు అధికం
  • ఫెడరల్ ఆడిట్‌ నివేదికలో తేలిన నిజం
  • భారీగా పెరిగిన దరఖాస్తులు, సిబ్బంది కొరతే ఈ జాప్యానికి ప్రధాన కారణం
  • చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో పోలిస్తే భారత్‌లో నిరీక్షణ సమయం చాలా ఎక్కువ
భారత్‌లో అమెరికా విజిటర్ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఇంటర్వ్యూ కోసం సగటున 346 రోజులు వేచి ఉండాల్సి వస్తోందని యూఎస్ ఫెడరల్ ఆడిట్‌లో వెల్లడైంది. కరోనా మహమ్మారికి ముందు ఈ నిరీక్షణ సమయం కేవలం 42 రోజులు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఏకంగా ఎనిమిది రెట్లకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా ప్రభుత్వానికి చెందిన గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్ (జీఏవో) సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది.

ఆడిట్ నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం సుమారు 14,55,255 దరఖాస్తులు వచ్చాయి. అయితే, వీటిని ప్రాసెస్ చేయడానికి దేశవ్యాప్తంగా కేవలం 68 మంది కాన్సులర్ అధికారులు మాత్రమే అందుబాటులో ఉన్నారు. అంటే, ఒక్కో అధికారి సగటున 21,401 దరఖాస్తులను పరిశీలించాల్సి వస్తోంది. ఈ గణాంకాలు అన్ని రకాల తాత్కాలిక వీసాలకు సంబంధించినవి కాగా, 346 రోజుల నిరీక్షణ సమయం ప్రత్యేకంగా విజిటర్ వీసా ఇంటర్వ్యూలకే వర్తిస్తుంది.

ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్‌లో పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. చైనాలో యూఎస్ విజిటర్ వీసా ఇంటర్వ్యూ కోసం సగటు నిరీక్షణ సమయం 34 రోజులు కాగా, బ్రెజిల్‌లో 32 రోజులుగా ఉంది. భారత్‌తో సమానంగా దరఖాస్తుల భారం ఉన్న మెక్సికోలో సైతం ఈ సమయం 283 రోజులుగానే నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వీసా నిరీక్షణ సమయం ఉన్న 10 దేశాల జాబితాలో భారత్ ఏడో స్థానంలో నిలిచింది.

ఈ జాప్యానికి గల కారణాలను విశ్లేషించేందుకు ఆడిటర్ల బృందం న్యూఢిల్లీ, మెక్సికో సిటీ, బీజింగ్, సావో పాలో నగరాల్లో పర్యటించింది. కరోనా తర్వాత వీసా దరఖాస్తుల డిమాండ్ భారీగా పెరగడం, దానికి తగినట్లుగా సిబ్బందిని నియమించకపోవడమే భారత్, మెక్సికోలలో పేరుకుపోయిన దరఖాస్తులకు (బ్యాక్‌లాగ్) ప్రధాన కారణమని అక్కడి అధికారులు తెలిపినట్లు నివేదిక పేర్కొంది.

సిబ్బంది కొరతతో పాటు, మౌలిక సదుపాయాల పరిమితులు కూడా సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో ఉన్న ఇంటర్వ్యూ విండోల సంఖ్య, పెరిగిన డిమాండ్‌కు సరిపోవడం లేదని ఆడిట్ గుర్తించింది. వందలాది మంది దరఖాస్తుదారులు ఎంబసీ బయట, సెకండరీ వెయిటింగ్ ఏరియాల్లో వేచి ఉండటాన్ని ఆడిటర్లు గమనించారు. ఎంబసీ ప్రాంగణంలో కొత్త భవనానికి మారినా, ఇంటర్వ్యూ విండోల సంఖ్య పెరగడం లేదని నివేదిక స్పష్టం చేసింది.

కొంతమంది వీసా ఏజెంట్ల పాత్ర కూడా జాప్యానికి కారణమవుతోందని అధికారులు తెలిపారు. ఈ ఏజెంట్లు అపాయింట్‌మెంట్ స్లాట్‌లు అందుబాటులోకి రాగానే వాటిని బ్లాక్ చేసి, తమ క్లయింట్లకు అమ్ముకుంటున్నారని స్టేట్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఆడిటర్లకు వివరించారు. ఈ విధానాన్ని అరికట్టేందుకు షెడ్యూలింగ్ వ్యవస్థలో మార్పులు చేసినట్లు వారు తెలిపారు.

ఈ ఒత్తిడిని తగ్గించేందుకు అమెరికా విదేశాంగ శాఖ పలు చర్యలు చేపడుతోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఇంటర్వ్యూ మినహాయింపు (వేవర్)కు అర్హత ఉన్న న్యూఢిల్లీ కేసుల్లో 80.6 శాతాన్ని వాషింగ్టన్‌లోని ప్రత్యేక యూనిట్ రిమోట్‌గా ప్రాసెస్ చేసింది. అలాగే, దరఖాస్తుల పరిష్కారం కోసం న్యూఢిల్లీలోని సిబ్బంది అదనంగా శనివారాల్లో కూడా పనిచేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది.
Advertisement
US Visa
India US visitor visa wait time
US Federal Audit GAO report
US Embassy New Delhi visa delay
Non immigrant visa applications India
US visa interview appointment backlog

More Telugu News