భారీ వర్షాలకు ఏపీలో 44 వేల హెక్టార్లలో పంట నష్టం

భారీ వర్షాలకు ఏపీలో 44 వేల హెక్టార్లలో పంట నష్టం

Andhra Pradesh heavy rains damage crops in 44000 hectares
  • బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో ఏపీలో పంటలకు తీవ్ర నష్టం
  • 44,029 హెక్టార్లలో వ్యవసాయ, 1,734 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు అంచనా
  • రాష్ట్రవ్యాప్తంగా 2,405 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసం
  • రోడ్ల పునరుద్ధరణకు సుమారు రూ.1,498 కోట్లు అవసరమని ప్రభుత్వం వెల్లడి
  • పంట నష్టాన్ని పక్కాగా అంచనా వేయాలని అధికారులకు మంత్రుల ఆదేశాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతినగా, వేల కిలోమీటర్ల మేర రహదారులు ధ్వంసమయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో పంటలు, మౌలిక సదుపాయాలకు కలిపి రూ.1,500 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. నష్టాన్ని అంచనా వేసి, సహాయక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది.

పంట నష్టంపై పక్కాగా లెక్కలు తీయాలి: మంత్రి అచ్చెన్నాయుడు

భారీ వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల ప్రాథమిక నివేదికల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 44,029 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 1,734 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు.

వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం, 190 మండలాల్లోని 1,229 గ్రామాల్లో సుమారు 71,796 మంది రైతులు పంట నష్టాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పటివరకు 19 మండలాల్లో 45 గ్రామాలకు చెందిన 726 మంది రైతుల నష్టాన్ని అంచనా వేశారు. ఇక ఉద్యాన శాఖ అంచనాల ప్రకారం, 14 జిల్లాల్లోని 89 మండలాల్లో 5,777 మంది రైతులకు చెందిన 1,734 హెక్టార్ల పంటకు నష్టం వాటిల్లింది. ఇందులో 445 హెక్టార్ల మేర నష్టాన్ని అంచనా వేయగా, మిగిలిన ప్రాంతంలో లెక్కింపు కొనసాగుతోందని అధికారులు మంత్రికి వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో నష్టపోయిన ప్రతి రైతు వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. నష్ట అంచనాల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, సమగ్రంగా వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.

రోడ్ల పునరుద్ధరణకు రూ.1498 కోట్లు: మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

మరోవైపు, వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా రోడ్లు, భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2,405 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని, వీటి పునరుద్ధరణకు సుమారు రూ.1,498.30 కోట్లు అవసరమవుతాయని వెల్లడించారు. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 412 కిలోమీటర్ల రోడ్లు ధ్వంసమయ్యాయని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 36 చోట్ల రోడ్లు కొట్టుకుపోగా, 9 చోట్ల గండ్లు పడ్డాయని తెలిపారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఈ ప్రాంతాల్లో వెంటనే తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేశామన్నారు. దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక పునరుద్ధరణకు రూ.162.09 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.1,336.83 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారని మంత్రి వివరించారు. త్వరలోనే దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధరించి, రవాణా వ్యవస్థను సాధారణ స్థితికి తీసుకొస్తామని ఆయన హామీ ఇచ్చారు.


Advertisement
Andhra Pradesh
Atchannaidu
BC Janardhan Reddy
Crop damage
Heavy rains
Road restoration

More Telugu News