ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు ఇప్పటి వరకు ఎంత ఖర్చయిందో తెలుసా?

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు ఇప్పటి వరకు ఎంత ఖర్చయిందో తెలుసా?

United States War With Iran Do You Know How Much It Has Cost So Far
  • నెలకు మరో రూ.19,190-28,785 కోట్ల ఖర్చయ్యే అవకాశం
  • ఆయుధాల భర్తీకి రూ.2.08 లక్షల కోట్లు వెచ్చించిన అగ్రరాజ్యం
  • క్షిపణి నిల్వల్లో సగం వరకు తగ్గినట్లు సీబీఓ నివేదిక
  • నిల్వల భర్తీకి కనీసం ఐదేళ్లు పట్టొచ్చని వెల్లడి
  • అదనంగా రూ.8.41 లక్షల కోట్ల నిధులు కోరిన వైట్‌హౌస్‌
ఇరాన్‌తో అమెరికా చేపట్టిన సైనిక చర్యకు ఇప్పటికే భారీగా ఖర్చయింది. ఈ ఏడాది జులై వరకు పెంటగాన్‌ దాదాపు 38 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.3.65 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు అమెరికా కాంగ్రెస్‌ బడ్జెట్‌ కార్యాలయం (సీబీఓ) తెలిపింది. యుద్ధం కొనసాగితే ప్రతి నెలా మరో 2 నుంచి 3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.19,190 కోట్ల నుంచి రూ.28,785 కోట్లు) ఖర్చయ్యే అవకాశం ఉందని పేర్కొంది.

ఫిబ్రవరి 28న ప్రారంభమైన ‘ఆపరేషన్‌ ఎపిక్‌ ఫ్యూరీ’కి సంబంధించిన సైనిక, రవాణా, ఆర్థిక వ్యయాలను సీబీఓ పరిశీలించింది. మొత్తం 38 బిలియన్‌ డాలర్లలో 21.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.2.08 లక్షల కోట్లు) క్షిపణులు, ఇతర ఆయుధాలను సమకూర్చేందుకే ఖర్చయ్యాయి.

అందులో క్షిపణి రక్షణ ఇంటర్‌సెప్టర్లకు 13.1 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.26 లక్షల కోట్లు), భూతల దాడి క్రూయిజ్‌ క్షిపణులకు 7.3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.70,044 కోట్లు) వెచ్చించారు. అదనపు విమాన ప్రయాణాలకు 10.4 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.99,788 కోట్లు), సైనిక ఇంధన ఖర్చులకు 2.7 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.25,907 కోట్లు) ఖర్చయ్యాయి.

యుద్ధంలో ధ్వంసమైన పరికరాలకు 1.9 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.18,231 కోట్లు), ఇతర కార్యకలాపాలకు 1.5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.14,393 కోట్లు) ఖర్చైనట్లు సీబీఓ తెలిపింది.

అమెరికా క్షిపణి రక్షణ నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయని సీబీఓ హెచ్చరించింది. 2025 జూన్‌ నుంచి ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఇంటర్‌సెప్టర్లలో సగం నుంచి మూడింట రెండొంతుల వరకు వినియోగించి ఉండొచ్చని పేర్కొంది. వాటిని తిరిగి సమకూర్చేందుకు కనీసం ఐదేళ్లు పట్టొచ్చని అంచనా వేసింది.

యుద్ధ ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీస్తోంది. హర్మూజ్‌ జలసంధి, ఎర్ర సముద్రం మీదుగా చమురు, సహజ వాయువు రవాణాకు అంతరాయం ఏర్పడటంతో ఇంధన ధరలు పెరిగాయి. దీంతో 2026 రెండో త్రైమాసికంలో వార్షిక ద్రవ్యోల్బణ రేటుపై 2.3 శాతం పాయింట్ల ప్రభావం పడిందని సీబీఓ తెలిపింది. 2027 తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం గత అంచనా కంటే 0.5 శాతం పాయింట్లు ఎక్కువగా ఉండొచ్చని పేర్కొంది.

వైట్‌హౌస్‌ మొత్తం 87.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.8.41 లక్షల కోట్లు) అదనపు నిధులు కోరింది. ఇందులో పెంటగాన్‌ కోసం 67.1 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.6.44 లక్షల కోట్లు) ఉన్నాయి. అందులో 42.3 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.4.06 లక్షల కోట్లు) నేరుగా ఇరాన్‌ యుద్ధానికి సంబంధించినవిగా కనిపిస్తున్నాయని సీబీఓ తెలిపింది.

అయితే ఈ అంచనాల్లో అమెరికా సైనిక స్థావరాల మరమ్మతుల ఖర్చు లేదు. దౌత్య కార్యకలాపాలు, విదేశీ సాయం, గాయపడిన సైనికుల భవిష్యత్‌ వైద్యం, పరిహారం ఖర్చులనూ సీబీఓ లెక్కలోకి తీసుకోలేదు. పెంటగాన్‌ కోరిన సమాచారం పూర్తిగా అందకపోవడంతో నివేదికలోని అంచనాల్లో గణనీయమైన అనిశ్చితి ఉందని సీబీఓ స్పష్టం చేసింది.
Advertisement
United States
Iran War Cost
Pentagon Military Spending
Operation Epic Fury
CBO Report
US Missile Defense

More Telugu News