58 యుద్ధాల ప్రభావం 850 కోట్ల మందిపై పడింది: కేఏ పాల్
- నిత్యావసర వస్తువులు, ఇంధన ధరల పెరుగుదలపై పాల్ ఆవేదన
- ఇరాన్ యుద్ధం వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతిన్నదని వ్యాఖ్య
- ప్రపంచ శాంతి కోసం టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రశాంతతా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న యుద్ధాల కారణంగా నిత్యావసర వస్తువులు, ఇంధన ధరలు నియంత్రణ లేకుండా పెరిగిపోతుండటంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ప్రపంచంలో జరిగిన వివిధ 58 యుద్ధాల ప్రభావం దాదాపు 200 దేశాలలోని 850 కోట్ల మంది ప్రజలపై తీవ్రంగా పడిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి చివరి నుంచి ప్రారంభమై ఆరు నెలలుగా కొనసాగుతున్న అమెరికా - ఇరాన్ సైనిక ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ దెబ్బతిని, సామాన్యుడికి నిత్యావసరాలు అందని ద్రాక్షగా మారాయని అన్నారు.
మార్కెట్లో రూ. 100 ఉండే వస్తువుల ధరలు రూ. 200 నుండి రూ. 300 వరకు పెరిగాయని, లీటర్ పెట్రోల్, గ్యాస్ ధరలు 2 డాలర్ల నుండి ఏకంగా 4 నుండి 5 డాలర్లకు పైగా భారమయ్యాయని లెక్కలతో వివరించారు. ధనిక వర్గాలకు దీనివల్ల పెద్దగా ఇబ్బంది లేకపోయినప్పటికీ, సమాజంలో ఉన్న 90 శాతం పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి నెలకొంటేనే ధరల నియంత్రణ సాధ్యమవుతుందని స్పష్టం చేసిన కేఏ పాల్, గ్లోబల్ పీస్ సాధన కోసం రాబోయే సెప్టెంబర్ 28న వాషింగ్టన్ డీసీలోని టైమ్స్ స్క్వేర్ వద్ద ప్రత్యేక ప్రశాంతతా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.