హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌లో తొలిసారిగా జరిగిన జాతీయ ఎన్నికల్లో హోరాహోరీ పోరు నెలకొంది. మంగళవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు "హంగ్" వాతావరణాన్ని సూచిస్తున్నాయి. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కూటమి, మాజీ సైన్యాధిపతి గాడి ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోటీ నడిచింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 61 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను ఏ కూటమీ సాధించలేకపోయింది.

ప్రముఖ టీవీ ఛానెళ్లు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, 120 మంది సభ్యులున్న ఇజ్రాయెల్ పార్లమెంట్ (నెస్సెట్)లో ఐసెన్‌కోట్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమికి 52 నుంచి 53 స్థానాలు లభించే అవకాశం ఉంది. మరోవైపు, నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ, ఇతర మిత్రపక్షాలతో కూడిన కూటమికి సుమారు 50 స్థానాలు దక్కవచ్చని అంచనాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో అరబ్ పార్టీలు అనూహ్యంగా పుంజుకున్నాయి. గతంలో 10 సీట్లు గెలుచుకున్న ఈ పార్టీలు, ఈసారి 17 నుంచి 18 స్థానాలు సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఈ పార్టీలు కీలకపాత్ర పోషించే అవకాశం ఉంది.

పార్టీల వారీగా చూస్తే, నెతన్యాహుకు చెందిన లికుడ్ పార్టీ 24-25 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించే సూచనలు కన్పిస్తున్నాయి. ఐసెన్‌కోట్ కొత్తగా స్థాపించిన యషార్ పార్టీకి 21-23 స్థానాలు, నఫ్తాలి బెన్నెట్ పార్టీకి 12-14 స్థానాలు రావొచ్చని అంచనా.

హమాస్ దాడుల తర్వాత నెతన్యాహు నాయకత్వంపై రిఫరెండంగా ఈ ఎన్నికలను భావించారు. రికార్డు స్థాయిలో 77.7 శాతం పోలింగ్ నమోదైంది. గత రెండు దశాబ్దాల్లో ఇదే అత్యధికం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై ప్రతిపక్ష నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇది నెతన్యాహు ప్రభుత్వంపై ప్రజల అవిశ్వాసానికి నిదర్శనమని ఐసెన్‌కోట్ వ్యాఖ్యానించగా, నెతన్యాహు కూటమికి ఇది ఘోర పరాజయమని ప్రతిపక్ష నేత యైర్ లాపిడ్ అన్నారు. అరబ్ పార్టీల నేతలు తమ ఫలితాలను "చరిత్రాత్మక విజయం"గా అభివర్ణించారు.

ఈ ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వారాల తరబడి కొనసాగే అవకాశం ఉంది. అధికారికంగా పూర్తి ఫలితాలు వెలువడటానికి మరికొన్ని రోజులు పట్టవచ్చు. అనంతరం, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి, ప్రభుత్వ ఏర్పాటుకు ఒక నేతను ఆహ్వానిస్తారు. ఈ ప్రక్రియకు 42 రోజుల వరకు సమయం పట్టవచ్చు. అప్పటివరకు నెతన్యాహు తాత్కాలిక ప్రధానిగా కొనసాగే అవకాశం ఉంది.