ఫాంహౌస్‌లో కేసీఆర్ కుట్ర.. మహిళా అధికారుల ముందు అభ్యంతరకరంగా వ్యవహరించారు: రేవంత్ రెడ్డి

ఫాంహౌస్‌లో కేసీఆర్ కుట్ర.. మహిళా అధికారుల ముందు అభ్యంతరకరంగా వ్యవహరించారు: రేవంత్ రెడ్డి

Revanth Reddy alleges KCR farmhouse conspiracy and BRS misbehavior in Assembly
  • శాసనసభ సజావుగా జరగకుండా కేసీఆర్ ఫాంహౌస్‌లోనే కుట్రలు జరిగాయన్న రేవంత్ రెడ్డి
  • ప్రజాప్రతినిధులను, పోలీసులను దూషిస్తూ మూడు రోజులు సభను అడ్డుకున్నారని మండిపాటు
  • బీఆర్ఎస్ కుట్రలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమర్థవంతంగా తిప్పికొట్టారని ప్రశంస

శాసనసభను సజావుగా సాగనివ్వకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఆయన ఫాంహౌస్‌లోనే కుట్రలు పన్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అధికారం పోయినా అహంకారం వీడని బీఆర్ఎస్ నాయకులు పోలీసు అధికారులను, ప్రజాప్రతినిధులను దూషిస్తూ మూడు రోజుల పాటు సభాకార్యక్రమాలను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఈరోజు నిర్వహించిన కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశంలో ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ ప్రసంగం చేశారు.


సభలో అధికారులపై అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా, సభాపతిని అత్యంత తీవ్ర పదజాలంతో దూషించారని, మహిళా అధికారుల ముందే టీషర్టులు విప్పి అభ్యంతరకరంగా నిరసన తెలపడం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దిగజారుడుతనానికి నిదర్శనమని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన తెలిపిన దళితులు నడిచిన నేలను బీఆర్ఎస్ నేతలు శుద్ధి చేసి దళితులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుండి జరిగిన ఈ అవాంఛనీయ ఘటనలన్నింటిపై ప్రభుత్వం తరఫున సమగ్ర విచారణకు ఆదేశించామని వెల్లడించారు. బీఆర్ఎస్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు.


కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయంగా ఎదిగిన సునీత లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లాంటి నాయకులు ఇప్పుడు అదే పార్టీకి నష్టం చేయాలని చూడటం దారుణమని సీఎం అన్నారు. కాంగ్రెస్ అవకాశం ఇవ్వకపోయి ఉంటే వారు రాష్ట్రస్థాయి నాయకులుగా ఎదిగేవారా? అని ప్రశ్నించారు. పోలీస్ సిబ్బందిలో కూడా కేటీఆర్‌కు తన రూపమే కనిపిస్తున్నట్టుందని, అందుకే అధికారులపై అంత ఆక్రోశంతో దాడులకు తెగబడుతున్నారని ఎద్దేవా చేశారు.


పాలనాపరంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల మైలురాయిని పూర్తి చేసుకున్న సందర్భంగా, చేపట్టిన సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఎం వివరించారు. చారిత్రక భవనంలో శాసన మండలిని పునఃప్రారంభించుకోవడమే కాకుండా, అసెంబ్లీలోని సెంట్రల్ హాల్‌ను ప్రారంభించి మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు పేరు పెట్టామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని, కేంద్రం చేపట్టబోయే జనాభా లెక్కల్లోనూ ఈ తెలంగాణ నమూనాను అమలు చేసేలా ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.


ఇదే సమయంలో 'ఎస్ఐఆర్' పేరుతో లక్షలాది ఓట్లను తొలగించే పెద్ద కుట్ర జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా ఉంటే, ఓటర్ల జాబితాలో మాత్రం కేవలం 88 కోట్లే చూపిస్తున్నారని, అంటే దాదాపు 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని వివరించారు. ఎమ్మెల్యేగా మళ్లీ గెలవాలనుకునే ప్రతీ ఒక్కరూ తమ నియోజకవర్గాల్లో ఓటు హక్కు పరిరక్షణను అత్యంత తీవ్రంగా పరిగణించాలని నిర్దేశించారు. శాసనసభ చర్చల్లో క్రమం తప్పకుండా పాల్గొనాలని, హాజరు శాతాన్ని కాపాడుకుంటూ స్థానిక సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యేలకు సూచించారు.

Advertisement
Revanth Reddy
KCR
BRS Party
Telangana Assembly
CLP Meeting
Telangana Politics

More Telugu News