కొడుకును చూడాలన్న తల్లి చివరి కోరిక తీరలేదు.. అంత్యక్రియలకు మాత్రం అనుమతి.. కన్నీటిపర్యంతమైన చిన్మ‌య్ కృష్ణ‌దాస్

కొడుకును చూడాలన్న తల్లి చివరి కోరిక తీరలేదు.. అంత్యక్రియలకు మాత్రం అనుమతి.. కన్నీటిపర్యంతమైన చిన్మ‌య్ కృష్ణ‌దాస్

Mothers last wish to see son unfulfilled Chinmoy Krishna Das granted parole for funeral
  • తల్లి అంత్యక్రియల కోసం 5 గంటల పెరోల్‌పై విడుదలైన హిందూ సన్యాసి
  • బంగ్లాదేశ్‌లో దేశద్రోహం కేసులో జైలులో ఉన్న చిన్మ‌య్ కృష్ణ‌ దాస్
  • కొడుకును చూడాలన్న తల్లి చివరి కోరిక తీరకుండానే ఆమె మృతి
  • అంత్యక్రియల అనంతరం తిరిగి జైలుకు వెళ్లిన సన్యాసి
  • ఆయ‌న‌పై దేశద్రోహంతో పాటు హత్య కేసు కూడా
బంగ్లాదేశ్‌లో దేశద్రోహం ఆరోపణలపై జైలులో ఉన్న హిందూ సన్యాసి చిన్మ‌య్ కృష్ణ‌ దాస్‌కు అధికారులు ఐదు గంటల పాటు పెరోల్ మంజూరు చేశారు. అనారోగ్యంతో మరణించిన తన తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయనకు ఈ వెసులుబాటు కల్పించారు. బతికున్నప్పుడు తనను చూడాలన్న తల్లి చివరి కోరిక తీరకపోవడం, కనీసం అంత్యక్రియలకైనా కుమారుడు హాజరుకావడం అక్కడి వారిని కంటతడి పెట్టించింది.

వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగరణ్ జోట్ అధికార ప్రతినిధి అయిన చిన్మ‌య్ కృష్ణ‌ దాస్‌ను 2024 నవంబర్‌లో దేశద్రోహం కేసులో అరెస్టు చేశారు. జాతీయ జెండాను అగౌరవపరిచారనేది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉంటున్నారు. 

ఈ క్రమంలో ఆయన తల్లి సంధ్యా రాణి ధర్ (71) క్యాన్సర్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో ఛటోగ్రామ్‌లోని హఠాజారి ఆశ్రమంలో గురువారం కన్నుమూశారు. ఆమె బతికి ఉన్నప్పుడు తన కుమారుడిని చూడాలని ఆశపడ్డారు. దీనికోసం ఆయన కుటుంబ సభ్యులు పెరోల్‌కు దరఖాస్తు చేసినప్పటికీ, అనారోగ్యంతో ఉన్న బంధువును చూసేందుకు ఖైదీని విడుదల చేసే నిబంధన లేదని అధికారులు తిరస్కరించారు.

ఆమె మరణం తర్వాత ఛటోగ్రామ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ జహిదుల్ ఇస్లాం మియా మానవతా దృక్పథంతో స్పందించారు. తల్లి అంత్యక్రియల కోసం చిన్మ‌య్ కృష్ణ‌ దాస్‌కు ఐదు గంటల పెరోల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. పెరోల్‌పై బయటకు వచ్చిన చిన్నయ్ దాస్, పుండరీక్ ధామ్ ఆలయంలో రాధాకృష్ణ విగ్రహం పాదాలను తాకి కన్నీటిపర్యంతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

చిన్నయ్ దాస్‌పై దేశద్రోహం కేసుతో పాటు తన అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో ప్రభుత్వ ప్రాసిక్యూటర్ మరణానికి సంబంధించిన హత్య కేసు కూడా నమోదైంది. కొన్ని కేసుల్లో బెయిల్ లభించినప్పటికీ, ఇతర కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఆయన జైలులోనే కొనసాగుతున్నారు. 

తల్లి అంత్యక్రియలు పూర్తి చేసిన అనంతరం, గడువు ముగియగానే ఆయన తిరిగి ఛటోగ్రామ్ సెంట్రల్ జైలుకు వెళ్లారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీల హక్కుల కోసం పనిచేసే ఆయనకు పరిమిత కాలం పెరోల్ లభించడం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
Chinmoy Krishna Das
Bangladesh
Sedition Case
Hindu Monk
Parole
Chattogram

More Telugu News