తెలంగాణ బిడ్డగా పుట్టడం వల్ల నాకు వచ్చిన ప్రయోజం ఏమీ లేదు: ఉదయభాను
- తెలంగాణ ఏర్పాడిన తర్వాతే తనకు ఆఫర్లు లేకుండా పోయాయన్న ఉదయభాను
- తెలంగాణ బిడ్డగా తనకు ఎలాంటి అడ్వాంటేజ్ లభించలేదని ఆవేదన
- ప్రస్తుతం తాను సినీ నిర్మాణ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని వెల్లడి
ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను టాలీవుడ్ పరిశ్రమలో తన ప్రస్తుత పరిస్థితిపై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తనకు పరిశ్రమలో ఆఫర్లు తగ్గిపోయి, క్రమంగా అవకాశాలు లేకుండా పోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యం ఉన్న కథలు, సినిమాలు ఎక్కువగా వస్తున్నా... కేవలం ప్రాంతీయ నేపథ్యం ఉన్నంత మాత్రాన అవకాశాలు వచ్చేయవని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకముందే తాను బుల్లితెరపై అత్యధిక షోలు, ఎన్నో ఈవెంట్లు చేశానని ఉదయభాను గుర్తుచేశారు. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక నటిగా తనకు ఎలాంటి అడ్వాంటేజ్ లభించలేదని, చివరికి ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా తనను హోస్ట్‌గా పిలవలేదని వాపోయారు. తెలంగాణ బిడ్డగా పుట్టడం వల్ల తనకు వచ్చిన ప్రయోజనం సున్నా అని ఆమె అభివర్ణించారు.
దేవుడు ఇచ్చిన ప్రతిభతోనే పరిశ్రమలో తనని తాను నిలబెట్టుకున్నానని, సినిమాల్లో కొన్ని అవకాశాలు వచ్చినా సరైన కథలు లేకపోవడం వల్లే తాను నిరాకరించానని తెలిపారు. సీనియర్ హీరో రాజశేఖర్ సినిమాలో సాంగ్ తర్వాత తనకు అనేక ఆఫర్లు వచ్చినప్పటికీ, కొన్ని వ్యక్తిగత హద్దులు, నిబంధనలు పెట్టుకోవడం వల్ల వాటిని అంగీకరించలేదని వివరించారు. ప్రస్తుతం తాను సినీ నిర్మాణ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని, కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. అయితే నటనకు మాత్రం స్వస్తి చెప్పలేదని, ఇంప్రెస్ చేసే మంచి కథలు వస్తే కచ్చితంగా నటిస్తానని ఉదయభాను స్పష్టం చేశారు.