ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు ‘రక్తం చిందని మారణహోమం’: ప్రకాశ్ రాజ్

ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపు ‘రక్తం చిందని మారణహోమం’: ప్రకాశ్ రాజ్

Prakash Raj calls voter list deletion a bloodless genocide
  • ఓటర్ల జాబితా సవరణపై నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
  • దేశంలో ఆధునిక సెన్సార్‌షిప్ అమలవుతోందని విమర్శ
  • ప్రభుత్వం ప్రజల్లో భయాన్ని నింపుతోందని ఆరోపణ
  • దాదాపు 12 కోట్ల ఓట్లను నిశ్శబ్దంగా తొలగించారని వ్యాఖ్య
ప్రముఖ నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్ కేంద్ర ప్రభుత్వంపై, ఎన్నికల కమిషన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓట్ల ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)ను ‘రక్తం చిందని మారణహోమం’ (బ్లడ్‌లెస్ జెనోసైడ్)గా అభివర్ణించారు. దేశంలో ఆధునిక సెన్సార్‌షిప్ నడుస్తోందని, ప్రజలను భయానక వాతావరణంలోకి నెడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

గురువారం హైదరాబాద్‌లోని లమకాన్‌లో పాలస్తీనియన్ రచయిత్రి ఇబ్తిసామ్ అజెమ్ రాసిన 'ది బుక్ ఆఫ్ డిసపియరెన్స్' నవల తెలుగు అనువాద ఆవిష్కరణ సభలో ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ మాటలను ఉటంకిస్తూ.. ఓటర్ల జాబితా నుంచి పేర్లను భారీగా తొలగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. “రక్తం చుక్క చిందకుండానే మారణహోమం జరుగుతోంది. దాదాపు 12 కోట్ల ఓటర్ల పేర్లను నిశ్శబ్దంగా జాబితా నుంచి తొలగించారు” అని ఆయన అన్నారు.

ఈ ప్రక్రియ ఫిబ్రవరి వరకు కొనసాగుతుందని, ఆ తర్వాత జనాభా లెక్కలు (సెన్సస్) జరుగుతాయని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. "ఇదంతా ఒక పెద్ద ప్రణాళిక. రాష్ట్రాల్లోని ఎన్నికల కమిషన్ కార్యాలయాలు చిన్నవిగా, శక్తిహీనంగా మారిపోతాయి. ప్రజల డేటాను ఉపయోగించి ఎవరు కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు? ఎవరు ఏ వర్గానికి చెందినవారు? అని గుర్తించి వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చేస్తారు" అని తీవ్ర ఆరోపణలు చేశారు.

ముఖ్యంగా ఆదివాసీలు, దళితులు, ముస్లింలు, క్రైస్తవులను లక్ష్యంగా చేసుకుని వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మారుస్తున్నారని అన్నారు. రాజ్యాంగం అడ్డుగా ఉండటంతో సైన్యం నేరుగా అధికారం చేపట్టలేకపోతున్నా, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని నియంత్రణ సాధిస్తున్నారని విమర్శించారు.

ప్రభుత్వం ప్రజల్లో తీవ్రమైన భయాన్ని నింపిందని, దీంతో రచయితలు, ఫిల్మ్ మేకర్లు స్వీయ నియంత్రణ (సెల్ఫ్ సెన్సార్‌షిప్) పాటించే దుస్థితి ఏర్పడిందని ప్రకాశ్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫిల్మ్ సర్టిఫికేషన్, నోట్ల రద్దు, మూకదాడులు వంటి చర్యల ద్వారా ప్రజలను నిరంతరం ఆందోళనలో ఉంచుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన పాలస్తీన్ అంశంతో పాటు, సినిమా పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సెన్సార్‌షిప్ అనుభవాలను కూడా పంచుకున్నారు.
Advertisement
Prakash Raj
Voter list deletion
Election Commission of India
Bloodless genocide
Parakala Prabhakar
Indian democracy censorship

More Telugu News