పశ్చిమ బెంగాల్ బొగ్గు కుంభకోణంలో ఈడీ మెరుపు దాడులు.. హైదరాబాద్ ఏఎంఆర్ సంస్థ కార్యాలయాల్లో సోదాలు
- బొగ్గు కుంభకోణం, అక్రమ నిధుల మళ్లింపు కేసులో ఈడీ సోదాలు
- హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, కోల్‌కతా, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రదేశాల్లో ఏకకాలంలో తనిఖీలు
- ఐదేళ్లలో బొగ్గు సిండికేట్ రూ. 650 కోట్లకు పైగా ఆర్జించిందని ఆరోపణలు
పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపిన భారీ బొగ్గు కుంభకోణం, అక్రమ నిధుల మళ్లింపు కేసుకు సంబంధించి ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని ప్రముఖ ఏఎంఆర్ గ్రూప్ సంస్థ కార్యాలయాలు, దానికి సంబంధించిన కీలక వ్యక్తుల నివాసాలలో ఈడీ అధికారులు మెరుపు తనిఖీలు నిర్వహించడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
పశ్చిమ బెంగాల్ అక్రమ కోల్ మైనింగ్ వ్యవహారంలో ప్రత్యేక కోర్టులో ఈడీ ఇప్పటికే ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రధానంగా అరెస్టయిన చిన్మయ్ మోండల్, కిరణ్ ఖాన్‌లతో పాటు మరో ముగ్గురి పేర్లను అందులో చేర్చారు. అక్రమ రవాణా నిరాటంకంగా సాగేందుకు స్థానిక రాజకీయ ప్రముఖులు, కొందరు ప్రభుత్వ అధికారులకు భారీగా లంచాలు చెల్లించినట్లు విచారణలో తేలింది.