అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) రూపొందించిన ఒక ఏఐ పోస్టర్ తీవ్ర వివాదాస్పదమైంది. ‘మిస్టర్ సింగ్’ పేరుతో, జాతి వివక్షను ప్రేరేపించేలా ఉందంటూ సిక్కు, భారతీయ అమెరికన్ సంఘాలు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో డీహెచ్‌ఎస్ ఆ పోస్టర్‌ను ఉపసంహరించుకుంది. అనధికారిక కమర్షియల్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని ఈ ప్రచారాన్ని చేపట్టారు.

సెప్టెంబర్ 9న డీహెచ్‌ఎస్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ పోస్టర్‌ను పెట్టింది. ఇది ‘ట్రాన్స్‌ఫార్మర్స్: ఏజ్ ఆఫ్ డిపోర్టేషన్స్’ అనే సినిమా పోస్టర్‌ను పోలి ఉంది. ఇందులో డీహెచ్‌ఎస్ లోగోతో ఉన్న రోబోట్.. గడ్డం, తలపాగాతో ఉన్న దక్షిణాసియా వ్యక్తిపై దాడి చేస్తున్నట్లు చిత్రీకరించారు. ‘మా రోడ్ల నుంచి దిగిపోండి, మిస్టర్ సింగ్.. మీకు డ్రైవింగ్ రాదు’, ‘స్వయంగా దేశం విడిచి వెళ్లండి లేదా పరిణామాలు ఎదుర్కోండి’ వంటి నినాదాలు ఈ పోస్టర్‌లో ఉన్నాయి.

ఈ పోస్ట్ పెట్టిన వెంటనే సిక్కు కోయలిషన్, హిందూ అమెరికన్ ఫౌండేషన్ వంటి సంస్థలు దీనిని తీవ్రంగా ఖండించాయి. ‘సింగ్’ అనేది సిక్కులు, హిందువుల్లో అత్యంత సాధారణమైన పేరని, లక్షలాది మంది అమెరికన్లకు ఈ పేరు ఉందని, ఇది ఒక జాతిని లక్ష్యంగా చేసుకున్న దాడి అని వారు ఆరోపించారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి వంటి వారు కూడా దీనిని జాతి వివక్షగా అభివర్ణించారు.

విమర్శలు వెల్లువెత్తడంతో డీహెచ్‌ఎస్ గురువారం ఆ పోస్ట్‌ను తొలగించింది. ఫ్లోరిడాలో ప్రమాదానికి కారణమైన హర్జీందర్ సింగ్ అనే వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే ఈ పోస్ట్ పెట్టామని వివరణ ఇచ్చింది. అయితే, ఇది మొత్తం సమాజాన్ని అవమానించేలా ఉందని విమర్శకులు వాదించారు. అమెరికాలో ట్రక్కింగ్ రంగంలో సిక్కు సమాజం గణనీయమైన సంఖ్యలో ఉండటంతో ఈ ఘటన మరింత చర్చకు దారితీసింది.