వాయుసేన అమ్ములపొదిలో 'ఖగంతక్-243'

Khagantak 243 in Indian Air Force arsenal
  • స్వదేశీ 'ఖగంతక్-243' గ్లైడ్ బాంబు పరీక్ష విజయవంతం 
  • 180 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం
  • నాగ్‌పూర్‌కు చెందిన జేఎస్ఆర్ డైనమిక్స్, బీఈఎల్ సంయుక్తంగా అభివృద్ధి
  • శత్రువుల ఎయిర్ డిఫెన్స్ పరిధిలోకి వెళ్లకుండానే దాడులు చేసే వీలు
  • సుఖోయ్-30ఎంకేఐ ఫైటర్ జెట్ నుంచి ఈ బాంబు పరీక్ష
రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం దిశగా భారత్ మరో కీలక ముందడుగు వేసింది. భారత వాయుసేన (ఐఏఎఫ్), పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 'ఖగంతక్-243' అనే లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబు (ఎల్ఆర్‌జీబీ) డ్రాప్ ట్రయల్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షతో సుదూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం భారత వాయుసేనకు మరింత పెరిగింది.

ఈ పరీక్ష నిర్దేశిత లక్ష్యాలన్నింటినీ అందుకుందని, 'ఆత్మనిర్భర్ భారత్', 'మేకిన్ ఇండియా' స్ఫూర్తితో రక్షణ రంగంలో సరికొత్త శిఖరాలను అధిరోహించామని సెప్టెంబర్ 2న 'ఎక్స్' సోషల్ మీడియా వేదికగా ఐఏఎఫ్ ప్రకటించింది. ఇది భారత వాయుసేనతో పాటు దేశీయ రక్షణ పరిశ్రమకు కూడా ఒక ముఖ్యమైన మైలురాయి అని పేర్కొంది.

ఖగంతక్-243 ప్రత్యేకతలు
నాగ్‌పూర్‌కు చెందిన జేఎస్ఆర్ డైనమిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) సంయుక్తంగా ఈ బాంబును అభివృద్ధి చేశాయి. 300 కిలోల తరగతికి చెందిన ఈ బాంబులో 125 కిలోల శక్తివంతమైన వార్‌హెడ్ ఉంటుంది. సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి పొఖ్రాన్‌లో దీనిని పరీక్షించారు.

ఈ గ్లైడ్ బాంబును సుమారు 12 కిలోమీటర్ల ఎత్తు నుంచి జారవిడిచినప్పుడు, తనకున్న రెక్కల సహాయంతో గాలిలో తేలుతూ 180 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా కచ్చితత్వంతో ఛేదించగలదు. దీనివల్ల, శత్రుదేశాల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పరిధిలోకి వెళ్లకుండానే మన ఫైటర్ జెట్లు లోతైన ప్రాంతాల్లోని రన్‌వేలు, కమాండ్ సెంటర్లు వంటి వ్యూహాత్మక టార్గెట్లపై దాడి చేయవచ్చు.

భవిష్యత్తులో మిగ్-29కె, మిరాజ్-2000 వంటి ఇతర విమానాల్లోనూ దీనిని అనుసంధానించనున్నారు. ఇప్పటికే పరిమిత సంఖ్యలో వీటి ఉత్పత్తి కోసం బీఈఎల్‌కు ఐఏఎఫ్ కాంట్రాక్టు కూడా ఇచ్చింది. ఖగంతక్ వంటి ఆయుధాల రాకతో, దిగుమతి చేసుకునే గ్లైడ్ బాంబులపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
Advertisement
Khagantak-243
Indian Air Force
Long Range Glide Bomb
Atmanirbhar Bharat
Sukhoi 30MKI
Bharat Electronics Limited

More Telugu News