Advertisement

సముద్ర మట్టం పెరుగుతోంది.. కోల్‌కతా, ముంబైకి భారీ ముప్పు!

Rising Sea Levels Pose Major Threat to Kolkata and Mumbai
  • దక్షిణాసియాలో 1.4 కోట్ల మందికి ప్రమాదం
  • 2024లో 6 మిల్లీమీటర్లు పెరిగిన సముద్ర మట్టం
  • ప్రపంచవ్యాప్తంగా 77 కోట్ల మందికి ముప్పు
  • హిమనదాల కరుగుదలతో భారీ వరదలకు అవకాశం
  • 15-20 ఏళ్లలో దక్షిణాసియాకు భారీ వరదల ముప్పు
సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లోని కోల్‌కతా, ముంబై నగరాలకు భారీ ముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ ప్రభావంతో దక్షిణాసియాలో 1.4 కోట్ల మందికిపైగా ప్రజలు తమ ఇళ్లను శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉందని ఐరాస నివేదిక పేర్కొంది.

గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా హిమనదాలు, మంచు పలకలు కరుగుతున్నాయి. సముద్ర జలాల ఉష్ణోగ్రత కూడా పెరుగుతోంది. ఫలితంగా సముద్ర మట్టాలు మరింత వేగంగా పైకి వస్తున్నాయి. 2024లో సముద్ర మట్టం ఏడాదిలో దాదాపు 6 మిల్లీమీటర్లు పెరిగింది. ఇప్పటివరకు నమోదైన అత్యధిక వార్షిక పెరుగుదల ఇదేనని నివేదిక తెలిపింది.

కోల్‌కతా, ముంబైతో పాటు ఢాకా వంటి నగరాల్లో ప్రజల ఇళ్లకు ముప్పు పెరుగుతుందని ఐరాస పేర్కొంది. సముద్ర జలాలు శాశ్వతంగా చుట్టుముట్టే పరిస్థితి వస్తే భారీగా ప్రజలు వలస వెళ్లాల్సి వస్తుందని తెలిపింది.

సముద్ర మట్టం పెరుగుదల ప్రభావం తీర ప్రాంతాలకే పరిమితం కాదని ఐరాస అసిస్టెంట్‌ సెక్రటరీ జనరల్‌ నవీద్‌ హనీఫ్‌ చెప్పారు. ఆరోగ్యం, ఆహార భద్రత, మానవ హక్కులు, సంస్కృతి, పూర్వీకుల భూములు, ప్రజల గుర్తింపుపైనా ప్రభావం పడుతుందని తెలిపారు. ప్రభుత్వాలు తమ భవిష్యత్‌ ప్రణాళికల్లో ఈ ముప్పును పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టానికి ఐదు మీటర్ల లోపు ఎత్తులో నివసిస్తున్న దాదాపు 77 కోట్ల మంది ప్రజలు ప్రమాదంలో ఉన్నారని నివేదిక వెల్లడించింది. సముద్ర మట్టం పెరుగుదల వల్ల కనీసం 1.8 ట్రిలియన్‌ డాలర్ల విలువైన మౌలిక వసతులకు ముప్పు ఉందని తెలిపింది.

హిమాలయ హిమనదాల కరుగుదలపైనా ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే 15 నుంచి 20 ఏళ్లలో దక్షిణాసియాలో భారీ వరదలు వచ్చే ప్రమాదం ఉందని హనీఫ్‌ హెచ్చరించారు. ఆ తర్వాత కరవు, పంటల నష్టం, ఆహార భద్రతకు ముప్పు ఏర్పడొచ్చని తెలిపారు.
Advertisement
United Nations
Rising Sea Levels
Mumbai
Kolkata
Global Warming
South Asia Climate Threat

More Telugu News