నేపాల్ జలప్రళయం: 675కి చేరిన మృతులు.. ఆపన్నహస్తం అందిస్తున్న భారత్

Nepal Flood Disaster 675 Dead as India Extends Helping Hand
  • నేపాల్‌లో వరదల కారణంగా 675 మంది మృతి, 2,498 మంది గల్లంతు
  • భారీ వరదలకు 589 మంది విదేశీయులతో సహా 753 మంది పర్యాటకులు అదృశ్యం
  • సహాయక చర్యల కోసం నాలుగో విమానంలో 11 టన్నుల సామగ్రి పంపిన భారత్
  • వంతెనల నిర్మాణం కోసం భారీగా పరికరాలు, సాంకేతిక బృందాలను పంపిస్తున్న ఇండియా
  • ఇప్పటివరకు మొత్తం 68.5 టన్నుల సహాయక సామగ్రిని నేపాల్‌కు చేరవేత
పొరుగు దేశం నేపాల్‌ను భారీ వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి విపత్తులు అతలాకుతలం చేస్తున్నాయి. భోటే కోశి నదికి ఆకస్మికంగా వచ్చిన వరదల కారణంగా సంభవించిన ఈ జల ప్రళయంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేపాల్ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 675 మృతదేహాలను వెలికితీయగా, మరో 2,498 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విపత్తు పర్యాటకులపైనా తీవ్ర ప్రభావం చూపింది. 589 మంది విదేశీయులతో సహా మొత్తం 753 మంది పర్యాటకులతో సంబంధాలు తెగిపోయినట్లు నేపాల్ పర్యాటక శాఖ నిన్న‌ సాయంత్రం ప్రకటించింది.

ఈ వరదల వల్ల రసువా, నువాకోట్, ధాదింగ్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. అనేక జలవిద్యుత్ ప్రాజెక్టులు, రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. బాధితులను ఆదుకోవడానికి సహాయక సామగ్రిని విరాళంగా ఇవ్వాలని స్థానిక సంస్థలు, ప్రజలను ఖాట్మండు జిల్లా యంత్రాంగం కోరినట్లు జిన్హువా వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది.

నేపాల్‌కు అండగా భారత్ 
ఈ కష్టకాలంలో నేపాల్‌కు అండగా నిలుస్తున్న భారత్, తన సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది. తాజాగా నాలుగో విడతగా 11 టన్నుల సహాయక సామగ్రితో కూడిన C-130 విమానాన్ని నేపాల్‌కు పంపినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ఈ విమానంలో గాలింపు చర్యల కోసం ప్రత్యేక సాంకేతిక బృందం, వారి పరికరాలు, మృతదేహాల గుర్తింపు కోసం ఫోరెన్సిక్ నిపుణులు, వారికి అవసరమైన డీఎన్ఏ విశ్లేషణ కిట్లు ఉన్నాయని ఆయన 'ఎక్స్‌'లో వెల్లడించారు. వీటితో పాటు దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగులు, టార్పాలిన్లు, ప్లాస్టిక్ షీట్లు, పరిశుభ్రత కిట్లు వంటివి కూడా పంపినట్లు వివరించారు.

ఇప్పటికే 230 అడుగుల పొడవైన మాడ్యులర్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పరికరాలతో 16 ట్రక్కులు నేపాల్‌కు చేరుకున్నాయని, మరో ఏడు బెయిలీ వంతెనల నిర్మాణానికి కూడా త్వరలో సామగ్రిని సరఫరా చేస్తామని జైశంకర్ తెలిపారు. వీటిని నిర్మించేందుకు సాంకేతిక బృందాలు కూడా త్వరలో అక్కడికి చేరుకుంటాయన్నారు. ఇప్పటివరకు మొత్తం 68.5 టన్నుల సహాయక సామగ్రిని విమానాల ద్వారా ఖాట్మండుకు తరలించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. నేపాల్‌లో సహాయక చర్యలకు తమ మద్దతు కొనసాగుతుందని భారత్ స్పష్టం చేసింది.
Advertisement
Nepal Floods
India Aid to Nepal
S Jaishankar
Bhote Koshi River
Kathmandu
Disaster Relief

More Telugu News