ఇంటింటికీ టీడీపీ: 90 లక్షల ఇళ్ల మైలురాయిని దాటిన కార్యక్రమం

Telugu Desam Party Intintiki TDP program crosses 90 lakh houses milestone
  • 33వ రోజూ విజయవంతంగా కొనసాగిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’
  • ఇప్పటివరకు మొత్తం 90.55 లక్షల కుటుంబాలను సందర్శించిన శ్రేణులు
  • ప్రభుత్వ పథకాలపై ప్రజలకు వివరిస్తూ, వారి సమస్యల సేకరణ
  • కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్న టీడీపీ
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం' కార్యక్రమం మరో కీలక మైలురాయిని అధిగమించింది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఇప్పటివరకు 90 లక్షలకు పైగా కుటుంబాలను సందర్శించి, ప్రభుత్వ పనితీరుపై ఫీడ్‌బ్యాక్ సేకరించాయి. శుక్రవారంతో ఈ కార్యక్రమం 33వ రోజుకు చేరుకుంది.

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని టీడీపీ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఒక్కరోజే పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి రాష్ట్రవ్యాప్తంగా 2,07,428 ఇళ్లను సందర్శించారు. దీంతో కార్యక్రమం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు సందర్శించిన మొత్తం ఇళ్ల సంఖ్య 90.55 లక్షలకు చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు ప్రతి గడపకూ వెళ్లి, ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా కలుస్తున్నాయి. రైతులు, మహిళలు, యువత, పేదలు, మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. అదే సమయంలో, ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ, వారి అభిప్రాయాలను నేరుగా నమోదు చేసుకుంటున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో ఈ కార్యక్రమం మరింత ఉత్సాహంగా కొనసాగుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగస్వాములవుతున్నట్లు వారు పేర్కొన్నారు.
Advertisement
Telugu Desam Party
Intintiki TDP
Andhra Pradesh Politics
TDP Outreach Program
Welfare and Development Schemes
TDP Door to Door Campaign

More Telugu News