తెలంగాణలో పెరిగిన క్రైమ్ రేట్.. ఆందోళనకరంగా ఆర్గనైజ్డ్ క్రైమ్, డ్రగ్స్ కేసులు

How much has crime increased in Telangana in three years
  • తెలంగాణలో మూడేళ్లలో 7.15 శాతం పెరిగిన మొత్తం నేరాలు
  • నార్కోటిక్స్ కేసులు 46 శాతం పెరగడంపై ఆందోళన
  • సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాల్లో కనిపించిన తగ్గుదల
  • తీవ్రమైన నేరాలు తగ్గినా, సాధారణ నేరాలు పెరిగాయన్న గణాంకాలు
తెలంగాణలో గత మూడేళ్లతో పోలిస్తే మొత్తం నేరాల సంఖ్య 7.15 శాతం మేర పెరిగింది. ముఖ్యంగా మాదకద్రవ్యాలు (నార్కోటిక్స్) సంబంధిత కేసులు 46.10 శాతం పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డీజీపీ సీవీ ఆనంద్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో ఈ గణాంకాలను వెల్లడించారు.

పోలీసు శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, 2023-24లో 2,65,377గా నమోదైన మొత్తం కేసుల సంఖ్య, 2025-26 నాటికి 2,84,363కు చేరింది. ఇదే సమయంలో నార్కోటిక్స్ కేసులు 2,026 నుంచి 2,960కు పెరిగాయి. ఇక వ్యవస్థీకృత నేరాలు (ఆర్గనైజ్డ్ క్రైమ్) ఏకంగా 1,704 శాతం పెరుగుదలతో 25 నుంచి 451కి చేరడం గమనార్హం.

కాగా, కొన్ని విభాగాల్లో నేరాలు గణనీయంగా తగ్గముఖం పట్టాయి. సైబర్ నేరాలు 13.29 శాతం, ఆర్థిక నేరాలు 13.28 శాతం తగ్గాయి. అలాగే హత్యలు, దోపిడీల వంటి తీవ్రమైన నేరాలు కూడా 10.33 శాతం మేర తగ్గాయి. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదు 26.23 శాతం తగ్గడం ఊరటనిచ్చే అంశం.

మరోవైపు, చిన్నపాటి నేరాలు 7.28 శాతం పెరిగాయి. కొన్ని జిల్లాల్లో ఈ పెరుగుదల అధికంగా ఉంది. నార్కోటిక్స్ కేసుల పెరుగుదల పోలీసు శాఖకు పెద్ద సవాలుగా మారిందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. కేవలం గణాంకాలకే పరిమితం కాకుండా, ప్రతి నేరం వెనుక ఉన్న కారణాలను లోతుగా విశ్లేషించాలని అధికారులను ఆదేశించారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) డేటా అప్‌డేట్ రేటు 96 శాతానికి చేరడంపై ఆయన సిబ్బందిని అభినందించారు. క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరులో వృత్తిపరమైన ప్రమాణాలు పాటించాలని, నేరాల కట్టడికి పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు.
Advertisement
Telangana Police
CV Anand
Telangana Crime Rate
Narcotics Cases Telangana
Hyderabad Crime Statistics

More Telugu News