నియోజకవర్గాల విజన్ ప్లాన్.. పనితీరుకు అదే ప్రామాణికం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says Constituency Vision Plan is the standard for performance
  • ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ 
  • ప్రజాప్రతినిధులు నిరంతరం సమీక్షలు జరుపుతూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఆదేశం
  • అన్ని స్థాయిల్లో పొలిటికల్ గవర్నెన్స్, ప్రజా భాగస్వామ్యంతోనే మెరుగైన ఫలితాలు 
  • టెక్నాలజీని వాడుకుంటూ వినూత్నంగా ఆలోచించాలని సూచన
  • రాష్ట్ర విజన్ ప్లాన్ యూనిట్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని వెల్లడి
రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడం, పేదరిక రహిత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్' పనితీరుకు ప్రామాణికంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రణాళిక అమలులో ప్రజాప్రతినిధులు, అధికారులు కీలక పాత్ర పోషించాలని, ప్రజల భాగస్వామ్యంతోనే అద్భుత ఫలితాలు సాధించగలమని ఆయన దిశానిర్దేశం చేశారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లతో పాటు యంగ్ ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ పార్ట్‌నర్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.

నియోజకవర్గాల వారీగా నిర్దిష్ట విజన్ ప్లాన్‌ను రూపొందించుకుని అమలు చేయడం దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రప్రథమంగా జరుగుతోందని, ఈ వినూత్న కార్యక్రమానికి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. కీ-పెర్ఫామెన్స్ ఇండికేటర్లకు అనుగుణంగా ప్రతి రంగంలో వృద్ధి సాధించేలా పనిచేయాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. 

క్షేత్రస్థాయిలో నిర్వహించే సమీక్షలు మొక్కుబడిగా కాకుండా, ప్రజలకు పూర్తిగా జవాబుదారీగా ఉండేలా చూడాలని ఆదేశించారు. అన్ని స్థాయిల్లోనూ పొలిటికల్ గవర్నెన్స్ సమర్థవంతంగా అమలైనప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వాములను చేసినప్పుడు అద్భుత ఫలితాలు వస్తాయని, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి లభించిన ప్రజా స్పందనే ఇందుకు నిదర్శనమని గుర్తుచేశారు.

ఈ విజన్ ప్లాన్ అమలులో యంగ్ ప్రొఫెషనల్స్, నాలెడ్జ్ పార్ట్‌నర్లు, స్వర్ణ కార్యాలయాల సిబ్బంది పాత్ర అత్యంత కీలకమని సీఎం పేర్కొన్నారు. సంప్రదాయ ధోరణి వీడి వినూత్నంగా ఆలోచించాలని, స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆయా నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'డేటా లేక్' లోని సమాచారాన్ని విశ్లేషించుకోవాలని, టెక్నాలజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ఆదేశించారు. ఉద్యోగుల సామర్థ్యం పెంచేందుకు ఇప్పటికే 1.50 కోట్ల ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేశారని తెలిపారు.

ప్రభుత్వ లక్ష్యం కేవలం నగదు బదిలీ కాదని, లబ్ధిదారులను ఆర్థికంగా నిలబెట్టి వారిలో సాధికారత తీసుకురావడమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. P4 ప్రాజెక్టు ద్వారా పేదలకు అవసరమైన చేయూత అందిస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో తలసరి ఆదాయం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ ప్రతి పేద కుటుంబానికి అండగా ఉంటామనే భరోసా కల్పించాలన్నారు. జిల్లాలకు, నియోజకవర్గాలకు వస్తున్న పరిశ్రమలు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేలా (గ్రౌండింగ్) ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆదేశించారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు విద్య, వైద్యం భారంగా మారకుండా ఉండేందుకే 'తల్లికి వందనం', 'సంజీవని' వంటి పథకాలు తెచ్చామని సీఎం వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడం వల్ల అదనంగా లక్ష మంది విద్యార్థులు చేరారని, ఇది వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించిందని పేర్కొన్నారు. 

మెగా డీఎస్సీ ప్రక్రియకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరిగినా, పారదర్శకంగా పూర్తి చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేశామని, దీనిపై విమర్శలు వస్తే టీచర్లే స్వయంగా ఉద్యమించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజలను మెప్పించగలిగితే వారి నుంచి సహకారం కూడా అదే స్థాయిలో ఉంటుందని సీఎం ఉద్ఘాటించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్‌, ఆర్థిక, ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్, ఏపీఎస్‌డీపీఎస్ ఈడీ వీఆర్ అలపర్తి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Advertisement
Chandrababu Naidu
Swarna Constituency Vision Action Plan
Andhra Pradesh Development
AP Government Performance
Poverty Free Andhra Pradesh
AP CM Review Meeting

More Telugu News