నేపాల్‌లో జల ప్రళయం.. 290 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు

Nepal Floods MEA Reports 290 Indians Untraceable Following Bhote Koshi Floods
  • నేపాల్‌లోని భోటే కోశి నదికి భారీ వరదలు
  • 290 మంది భారతీయుల ఆచూకీ లేద‌న్న‌ కేంద్రం
  • గల్లంతైన వారిలో తమిళనాడుకు చెందిన కైలాస యాత్రికులు
  • మొత్తం 517 మంది విదేశీయులతో పాటు 644 మంది ఆచూకీ గల్లంతు
  • సహాయక చర్యలు ముమ్మరం.. ఇప్పటివరకు 389 మృతదేహాలు లభ్యం
నేపాల్‌ను భారీ వరదలు ముంచెత్తడంతో ఘోర విషాదం చోటుచేసుకుంది. భోటే కోశి నదికి వచ్చిన ఆకస్మిక, ప్రచండ వరదల కారణంగా 290 మంది భారతీయులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయని, వారి ఆచూకీ తెలియడం లేదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) ఆందోళన వ్యక్తం చేసింది. నేపాల్‌లో సంభవించిన ఈ ప్రకృతి విపత్తులో వందల మంది విదేశీయులు గల్లంతయ్యారు.

విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వారిలో రసువా జిల్లాలోని త్రిశూలి-I జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ కార్మికులు ఉన్నారు. వీరితో పాటు కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికులు కూడా గల్లంతైన వారిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు, వరదల నుంచి సురక్షితంగా బయటపడిన కొంతమంది భారతీయుల జాబితాను కూడా ఎంఈఏ విడుదల చేసింది.

ఈ జల ప్రళయంతో రసువా, నువాకోట్ జిల్లాలు అత్యంత తీవ్రంగా ప్రభావితమయ్యాయి. నేపాల్ పోలీసుల సమాచారం ప్రకారం, నిన్న‌ మధ్యాహ్నం నాటికి మొత్తం 644 మంది గల్లంతయ్యారు. వీరిలో 517 మంది విదేశీయులు కాగా, 127 మంది నేపాల్ స్థానిక పౌరులు ఉన్నారు.

భారతీయులతో పాటు ఇతర దేశస్థులు కూడా పెద్ద సంఖ్యలో గల్లంతయ్యారు. బుధవారం నాటి వరదల తర్వాత నేపాల్‌లో సుమారు 100 మంది చైనా జాతీయుల ఆచూకీ తెలియడం లేదని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో 90 మంది అమెరికన్ పౌరులు చిక్కుకుని ఉండవచ్చని, వారిలో ముగ్గురిని సురక్షితంగా కాపాడామని యూఎస్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. ఇప్పటివరకు ఏ అమెరికన్ పౌరుడు మరణించినట్లు తమకు సమాచారం లేదని పేర్కొంది. గల్లంతైన వారిలో 53 మంది ఉక్రేనియన్లు, 51 మంది మలేషియన్లు, 35 మంది ఆస్ట్రేలియన్లు, 33 మంది బ్రిటన్ వాసులు, 25 మంది కెనడియన్లతో పాటు పలు దేశాల పౌరులు ఉన్నారు.

నేపాల్‌లోని వరద ప్రభావిత జిల్లాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బురద, శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించడానికి, వరదల్లో కొట్టుకుపోయిన వారి కోసం అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటివరకు వరదల్లో కొట్టుకుపోయిన 389 మంది మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు. అత్యధికంగా చిత్వాన్‌లో 137, నవల్‌పరాసి ఈస్ట్‌లో 87, ధాదింగ్‌లో 33 మృతదేహాలను గుర్తించారు. భోటే కోశి, దాని దిగువ నదీ వ్యవస్థల్లో వచ్చిన ఈ ఆకస్మిక వరదల వల్ల అనేక నివాస ప్రాంతాలు, రోడ్లు, వంతెనలు, జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఇతర కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Advertisement
Nepal Floods
Ministry of External Affairs
Bhote Koshi River
Trishuli Hydroelectric Project
Kailash Mansarovar Pilgrims
Missing Indians in Nepal

More Telugu News