నాకు తెలుగు అర్థమవుతుంది: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- ముసునూరులో పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించిన రాధాకృష్ణన్
- తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన రాధాకృష్ణన్
- నదుల అనుసంధానం వాస్తవ రూపం దాలుస్తుందని ఆశాభావం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ పరిధిలోని ముసునూరులో నాన్-జీఎంఓ పాప్‌కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి సభలోని వారిని అలరించారు. తనకు తెలుగు అర్థమవుతుందని.. కానీ స్పష్టంగా మాట్లాడలేనని చెప్పారు.
మన దేశంలో జనవరి 14న సంక్రాంతి పంటల పండుగను విభిన్న పేర్లతో కలిసికట్టుగా జరుపుకుంటామని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణల్లో సంక్రాంతిగా, తమిళనాడులో పొంగల్‌గా, పంజాబ్‌లో లోహ్రీగా, అసోంలో బిహూగా పిలుచుకుంటామని గుర్తుచేశారు.
దేశంలో 8 రాష్ట్రాల్లో 17,500 మంది రైతులు దాదాపు 40 వేల ఎకరాల్లో పాప్‌కార్న్ మొక్కజొన్నను పండించడం అభినందనీయమన్నారు. అమెరికా నుంచి పాప్‌కార్న్ దిగుమతి చేసుకోవడం మానేసి, మనమే అక్కడికి ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని చెప్పారు. డ్రోన్లను రైతులకు అద్దెకు ఇచ్చే పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,200 కోట్లను మహిళా సంఘాలకు కేటాయించిందని వివరించారు. మహానది నుంచి కావేరి నది వరకు నదుల అనుసంధానం కేవలం కలగానే మిగిలిపోదని, కొంత సమయం పట్టినా భవిష్యత్తులో తప్పకుండా వాస్తవ రూపం దాలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.