మాకు అంతకంటే ఎక్కువ టైమ్ ఇవ్వరు.. క్రికెట్ పై నారా లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Nara Lokesh makes interesting comments on cricket and family time
  • కుమారుడు దేవాన్ష్‌తో ప్రతి ఆదివారం క్రికెట్ ఆడతానన్న మంత్రి లోకేశ్
  • విశాఖ చంద్రంపాలెం స్కూల్లో రూ. 6.48 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం
  • కొత్తగా నిర్మించిన క్రికెట్, వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టుల ప్రారంభోత్సవం
  • విద్యార్థులతో కలిసి సరదాగా వాలీబాల్, బాస్కెట్‌బాల్ ఆడిన మంత్రి
  • ఈ పాఠశాలకు రావడం ఇది మూడోసారని, ప్రతిసారీ వర్షం పడుతుందని వ్యాఖ్య
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, ప్రతి ఆదివారం తన కుమారుడు దేవాన్ష్‌తో కలిసి రెండు, మూడు గంటల పాటు తప్పనిసరిగా క్రికెట్ ఆడతానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు అంతకంటే ఎక్కువ సమయం ఇవ్వరంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిసాయి.

విశాఖపట్నం జిల్లా, భీమునిపట్నం నియోజకవర్గంలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన క్రికెట్ ఇష్టాన్ని బయటపెట్టారు. 

ఈ పర్యటనలో భాగంగా పాఠశాలలో రూ. 6.48 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన పునర్‌నిర్మాణ, అభివృద్ధి పనులను మంత్రి లోకేశ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా కొత్తగా నిర్మించిన క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్ కోర్ట్, బాస్కెట్‌బాల్ కోర్ట్, వాకింగ్ ట్రాక్‌తో పాటు ఆర్‌వో వాటర్ ప్లాంట్‌ను కూడా ఆయన ప్రారంభోత్సవం చేశారు.

ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవి రావు, జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవాల అనంతరం మంత్రి లోకేశ్ విద్యార్థులతో కలిసిపోయారు. వారితో కలిసి సరదాగా వాలీబాల్, బాస్కెట్‌బాల్ ఆడి వారిలో ఉత్సాహం నింపారు.

ఈ పాఠశాలకు రావడం ఇది మూడోసారని, వచ్చిన ప్రతిసారీ భారీ వర్షం కురుస్తుందని లోకేశ్ గుర్తుచేసుకున్నారు. "ఈ స్కూల్ పేరు వింటేనే నాకు వాన గుర్తొస్తుంది. నా నియోజకవర్గం మంగళగిరిలోని స్కూల్‌కు కూడా నేను మూడుసార్లు వెళ్లలేదు" అని ఆయన అనడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి రాక సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
Advertisement
Nara Lokesh
Chandrababu Naidu
Andhra Pradesh IT Minister
Nara Devansh
Visakhapatnam school visit
Cricket passion

More Telugu News