మా నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలపండి: 'నోరుజారిన' కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే!

Merge our constituency into Andhra Pradesh says Karnataka Congress MLA N Y Gopalakrishna
  • నియోజకవర్గాన్ని ఏపీలో కలపాలంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
  • అభివృద్ధి లేదన్న ఆవేదనతోనే అలా మాట్లాడానని వెల్లడి
  • విమర్శలు రావడంతో నాలుక జారానంటూ క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే
  • బళ్లారికి బదులుగా పొరపాటున ఏపీ అని అన్నానని వివరణ
కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.వై. గోపాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. తన నియోజకవర్గమైన మొలకల్మూరును అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయాలని ఆయన చేసిన సూచన వివాదాస్పదమైంది. అయితే, దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో సోమవారం ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. తాను పొరపాటున అలా అన్నానని, అది కేవలం నోరు జారడం మాత్రమేనని స్పష్టం చేస్తూ క్షమాపణలు కోరారు.

మొలకల్మూరులో నిర్వహించిన ఒక కార్యక్రమంలో గోపాలకృష్ణ మాట్లాడుతూ, తన నియోజకవర్గం రాష్ట్ర సరిహద్దుల్లో ఉండటం వల్ల పాలకులెవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. "మొలకల్మూరు ఎమ్మెల్యేలకు సరైన గౌరవం దక్కడం లేదు. అందుకే ఈ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కానీ, లేదా పక్కనే ఉన్న చల్లకెరెలో కానీ కలిపితేనే అభివృద్ధికి అవకాశం ఉంటుంది" అని వ్యాఖ్యానించారు. గత కొన్నేళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని, ఇక్కడి పరిస్థితులు తనను తీవ్రంగా కలిచివేస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో గోపాలకృష్ణ వివరణ ఇచ్చారు. నియోజకవర్గాన్ని బళ్లారి లేదా చల్లకెరెలో విలీనం చేయాలని చెప్పబోయి, పొరపాటున ఆంధ్రప్రదేశ్ అని అన్నానని వివరించారు. "జర్నలిస్టులు వీడియో రికార్డింగ్ చూపించే వరకు నా తప్పును నేను గుర్తించలేదు. ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించాలన్న ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించండి" అని ఆయన వేడుకున్నారు. నిధుల కొరత, అభివృద్ధి కుంటుపడటం వల్లే తాను ఆవేదనతో ఆ మాటలు అనాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
Advertisement
N Y Gopalakrishna
Molakalmuru MLA
Karnataka Congress MLA
Andhra Pradesh merger controversy
Karnataka politics

More Telugu News