నేనూ ఆర్టికల్ 370కి మద్దతు ఇస్తున్నా.. నేను కూడా దిమాగీ నక్సలే: మెహబూబా ముఫ్తీ
- చర్చనీయాంశంగా మారిన మోదీ చేసిన దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలు
- ఆర్టికల్ 370కి మద్దతిచ్చేవారు కూడా దిమాగీ నక్సల్స్ కిందకు వస్తారన్న కిరణ్ రజిజు
- తీవ్రంగా స్పందించి మాజీ ముఖ్యమంత్రి మెహబూమా ముఫ్తీ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ‘దిమాగీ నక్సల్స్’ (మేధోపరమైన లేదా భావజాల నక్సలైట్లు) వ్యాఖ్యల వివాదంపై పీడీపీ అధినేత్రి, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రస్థాయిలో స్పందించారు.
గతంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని సమర్థిస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆర్టికల్ 370కి మద్దతు ఇచ్చేవారు, వేర్పాటువాదుల వైపు నిలబడేవారు, దేశాన్ని విభజించే ఆలోచనలు చేసేవారే ప్రధాని పేర్కొన్న ‘దిమాగీ నక్సల్స్’ కిందకు వస్తారని ఆయన అన్నారు.
దీనిపై సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించిన మెహబూబా ముఫ్తీ... కిరణ్ రిజిజు చేసిన పోస్ట్‌తో పాటు తన దివంగత తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్‌తో ప్రధాని మోదీ ఉన్న ఫోటోను షేర్ చేశారు. "నేను ఆర్టికల్ 370కి మద్దతు ఇస్తున్నాను. కాబట్టి నేను కూడా 'దిమాగీ నక్సల్'నే" అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.