చేతిలో జాతీయ‌ జెండా, గుండెల్లో అజెండా ఉండాలి.. దేశానికి ఏం చేయగలమని ఆలోచించాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says hold national flag in hand and agenda in heart for the nation
  • తెలుగువారికి 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
  • 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యమని స్పష్టీకరణ
  • దేశం కోసం ఏం చేయగలమో ప్రతిఒక్కరూ ఆలోచించాలని ప్రజలకు పిలుపు
  • చేతిలో జాతీయ జెండా, గుండెల్లో దేశం కోసం అజెండా ఉండాలని సందేశం
  • మహనీయుల త్యాగాలకు నిజమైన నివాళి దేశ భవిష్యత్తును నిర్మించడమేనని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సోష‌ల్ మీడియా వేదిక‌గా భావోద్వేగ‌ పోస్ట్ చేశారు. దేశ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దడమే స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలకు ఇచ్చే నిజమైన నివాళి అని చంద్రబాబు త‌న పోస్ట్‌లో పేర్కొన్నారు.

"ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితమే మన స్వాతంత్ర్యం. దేశం నాకు ఏం చేసిందని కాకుండా, దేశానికి నేను ఏం చేయగలనని ప్రతి ఒక్కరూ ‘అనే నేను..’ సంకల్పంతో ఆలోచించాలి" అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి చేతిలో జాతీయ జెండా, గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

2047 నాటికి 'వికసిత్ భారత్', 'స్వర్ణాంధ్ర' సాధించాలన్న లక్ష్యంలో అందరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు కోరారు. "100 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకల నాటికి దేశం, రాష్ట్రం స్వాతంత్ర్యం నుంచి సమృద్ధి వైపు, వికాసం నుంచి వైభవం వైపు సాగాలి. ఈ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఐక్యంగా అడుగులు వేద్దాం" అని ఆయన తెలిపారు. తన సందేశాన్ని ‘జై తెలుగుతల్లి! జై హింద్!’ నినాదాలతో ముగించారు.
Advertisement
Chandrababu Naidu
Independence Day
Andhra Pradesh
Viksit Bharat 2047
Swarnandhra
National Flag

More Telugu News