భారత రక్షణ రంగంలో కొత్త శకం.. రిలయన్స్-రోల్స్ రాయిస్ చారిత్రక ఒప్పందం!

Reliance and Rolls Royce sign historic deal for Indian defense sector
  • ఏఎంసీఏ యుద్ధ విమానం కోసం భారత్‌లో ఇంజిన్ల తయారీ
  • చేతులు కలిపిన రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ సంస్థ రోల్స్ రాయిస్
  • భారత్‌కు 100 శాతం టెక్నాలజీ బదిలీ, పూర్తి ఐపీ హక్కులు
  • యుద్ధ విమానాల ఇంజిన్ల కోసం విదేశాలపై ఆధారపడటానికి తెర
  • ఆత్మనిర్భర్ భారత్ దిశగా వ్యూహాత్మక ముందడుగు
భారత రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్య సాధనలో కీలక ముందడుగు పడింది. దేశీయంగా నిర్మిస్తున్న ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ 'ఏఎంసీఏ' (అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) కోసం అవసరమైన శక్తివంతమైన ఇంజిన్‌ను సంయుక్తంగా అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ దిగ్గజం రోల్స్-రాయిస్ ఒక మెగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంతో యుద్ధ విమాన ఇంజిన్ల కోసం విదేశాలపై ఆధారపడటానికి తెరపడనుంది.

ఈ చారిత్రాత్మక ఒప్పందం ప్రకారం, రోల్స్-రాయిస్ తన నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్ ఇంజిన్ టెక్నాలజీని (110 కిలోన్యూటన్ల సామర్థ్యం) భారత్‌కు పూర్తిగా బదిలీ చేయనుంది. దీనిపై పూర్తి మేధోసంపత్తి హక్కులు (ఐపీఆర్) కూడా భారత్‌కే దక్కనున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రిలయన్స్ ఏరోస్పేస్ విభాగం, దేశీయంగా ఈ ఇంజిన్ల తయారీ, అసెంబ్లీ, టెస్టింగ్, భవిష్యత్తు నిర్వహణ (ఎంఆర్‌వో) బాధ్యతలను చూసుకుంటుంది. డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న ఏఎంసీఏ మార్క్-2 యుద్ధ విమానాలకు ఈ ఇంజిన్లను అమర్చనున్నారు.

ప్రస్తుతం తేజస్ ఎంకే-1ఏ, ఎంకే-2 వంటి యుద్ధ విమానాలు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) ఇంజిన్లపై ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో, తాజా ఒప్పందంతో భారత్ ఈ రంగంలో స్వయంసమృద్ధి సాధించనుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి కొద్ది దేశాల సరసన ఫైటర్ జెట్ ఇంజిన్లను సొంతంగా తయారుచేసే సామర్థ్యం ఉన్న దేశంగా భారత్ అవతరించనుంది. పూర్తి ఐపీ హక్కులు ఉండటంతో భవిష్యత్తులో మిత్రదేశాలకు ఈ ఇంజిన్లను ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుంది.

రక్షణ రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ 'మేక్ ఇన్ ఇండియా' విధానానికి ఈ ఒప్పందం మరింత ఊతాన్నిచ్చింది. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా దేశంలో ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు, వేలాది మంది ఇంజనీర్లకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ పరిణామం భారత వైమానిక దళ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, అంతర్జాతీయంగా దేశ వ్యూహాత్మక బలాన్ని కొత్త శిఖరాలకు చేర్చనుంది.
Advertisement
Reliance Industries
Rolls-Royce
AMCA fighter jet engine
Indian defense sector
Make in India aerospace
Technology transfer

More Telugu News