ప్రజల ఏడుపే జగన్‌కు ఆనందం.. ఓదార్పు యాత్ర కూడా అందుకే చేశాడేమో!: కంచర్ల శ్రీకాంత్

Kancharla Srikanth says Jagan finds joy in peoples tears and slams Odarpu Yatra
  • ఈ నెల 17 నుంచి ఏపీ శాసనసభా సమావేశాలు
  • జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ విమర్శనాస్త్రాలు
  • ఇతరుల ఏడుపు చూసి ఆనందించే తీవ్రమైన మానసిక వైకల్యం జగన్ దని వ్యాఖ్యలు
  • కూటమి పాలన చూసి జగన్ అసూయతో రగిలిపోతున్నారన్న శ్రీకాంత్
రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటే చూడలేని ఏకైక వ్యక్తి జగన్ అని, ఇతరుల ఏడుపు చూసి ఆనందించే తీవ్రమైన మానసిక వైకల్యం ఆయనదని టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సినిమాల్లోని విలన్ల మాదిరిగా ఎవరైనా బాధపడుతుంటే చూసి పైశాచిక ఆనందం పొందడం జగన్ నైజమని, గతంలో ఆయన చేసిన ఓదార్పు యాత్రలు కూడా బహుశా ఇందుకోసమేనేమో అనిపిస్తోందని సెటైర్ విసిరారు. బుధవారం నాడు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన, నిరుద్యోగులకు జరుగుతున్న మేలు చూసి జగన్ అసూయతో రగిలిపోతున్నారని నిప్పులు చెరిగారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ఫైలుపైనే తొలి సంతకం చేశారని శ్రీకాంత్ గుర్తుచేశారు. ఈ నియామక ప్రక్రియను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు ఏకంగా 335 కేసులు వేసి కుట్రలు పన్నినా, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేశామని కొనియాడారు. 

లోకేశ్ తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణల ఫలితంగా, ఈ ఒక్క ఏడాదే 1,06,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను వదిలి ప్రభుత్వ బడుల్లో చేరారని తెలిపారు. రిక్రూట్‌మెంట్ పూర్తయి, ఉపాధ్యాయులు పాఠశాలల్లో చేరి ఏడాది కావస్తున్నా, అద్భుతమైన ఫలితాలు వస్తుంటే కడుపుమంటతో జగన్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎంగా విమర్శించే హక్కు ఉన్నా, అందులో హేతుబద్ధత ఉండాలని హితవు పలికారు.

విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ అమలు చేస్తున్న సంస్కరణలను అభినందించాల్సింది పోయి, ఆయన రాజీనామా డిమాండ్ చేయడానికి వైసీపీ నేతలకు సిగ్గుండాలని శ్రీకాంత్ మండిపడ్డారు.

"గతంలో బూట్లు, కోడిగుడ్లపై కూడా మీ ఫొటోలు వేసుకున్నారు. కానీ నారా లోకేశ్ ఒక్క బ్రోచర్ పైనా తన ఫొటో గానీ, సీఎం ఫొటో గానీ లేకుండా నాణ్యమైన ‘సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్’ అందిస్తున్నారు. ‘తల్లికి వందనం’ కింద ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ లబ్ధి చేకూరుస్తున్నారు. ‘డోక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం’ పేరుతో సన్న బియ్యంతో పౌష్టికాహారం అందిస్తూ, దాన్ని ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపజేశారు. ప్రతి నియోజకవర్గంలో ‘లీప్’ మోడల్ స్కూల్స్, ఒత్తిడి తగ్గించేందుకు ‘నో బ్యాగ్ డే’, ప్రతిభావంతులైన టీచర్లకు సింగపూర్ శిక్షణ ఇప్పిస్తున్నందుకు లోకేశ్ రాజీనామా చేయాలా?" అని శ్రీకాంత్ సూటిగా ప్రశ్నించారు.

డీఎస్సీ టీచర్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా జగన్ మాట్లాడుతున్నారని, దీనికి నిరసనగా కర్నూలులోని కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు 5,000 మంది ఉపాధ్యాయులు ర్యాలీగా వెళ్లి జగన్ వైఖరిపై తిరగబడ్డారని గుర్తుచేశారు. 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా జగన్‌కు బుద్ధి రాలేదని విమర్శించారు.

వైసీపీ అధినేత జగన్‌కు ‘జెన్ జీ’ అంటే కనీస అవగాహన కూడా లేదని శ్రీకాంత్ ఎద్దేవా చేశారు. "నిరసనల పేరుతో వృద్ధులను కూర్చోబెట్టి ‘జెన్ జీ వార్’ అని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదం. 1997-2012 మధ్య పుట్టిన యువతను జెన్ జీ అంటారు. వాళ్లు మీ ఆకృత్యాలను ముందే గ్రహించి 2024 ఎన్నికల్లో మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. మీ పార్టీలో ఉన్నది జెన్ Z కాదు.. గత ఐదేళ్లలో గంజాయికి అలవాటుపడిన ‘G - గంజాయి బ్యాచ్’," అని తీవ్రంగా ధ్వజమెత్తారు. ఒకవైపు లోకేశ్ విద్యా, ఐటీ శాఖల ద్వారా యువత భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంటే, జగన్ మాత్రం వారిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

ఈ నెల 17న ప్రారంభమయ్యే శాసనసభ, మండలి సమావేశాలకు జగన్, ఆయన పార్టీ ప్రజాప్రతినిధులు హాజరు కావాలని శ్రీకాంత్ సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వానికి ఏ అంశంపైనైనా సమాధానం చెప్పే దమ్ము, ధైర్యం ఉన్నాయని స్పష్టం చేశారు. ఇప్పటికైనా చవకబారు ఆరోపణలు మాని, అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించడం నేర్చుకోవాలని సూచించారు. లేకపోతే నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులే వైసీపీ నాయకులను రోడ్లపై తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.
Advertisement
Kancharla Srikanth
YS Jagan Mohan Reddy
Nara Lokesh
Mega DSC Recruitment
Andhra Pradesh Education Reforms
TDP vs YSRCP

More Telugu News