ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు షాక్.. హత్య కేసులో బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు
- రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో తీహార్ జైలులో ఉన్న సుశీల్ కుమార్
- నేర తీవ్రత దృష్ట్యా బెయిల్ ఇవ్వలేమన్న ఢిల్లీ హైకోర్టు
- పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్టు ఆధారాలు ఉన్నాయన్న హైకోర్టు
మాజీ జూనియర్ జాతీయ రెజ్లింగ్ ఛాంపియన్ సాగర్ ధంకర్ దారుణ హత్య కేసులో తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రముఖ ఒలింపిక్ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి జస్టిస్ పురుషేంద్ర కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ పిటిషన్ కొట్టివేశారు. కేసు పూర్వాపరాలు, నేరం యొక్క తీవ్రత, సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.
అరెస్టుకు ముందు సుశీల్ కుమార్ ప్రవర్తించిన తీరు, పక్కా ప్రణాళికతోనే ఈ హత్యకు ఒడిగట్టినట్లు ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని న్యాయమూర్తి తమ తీర్పులో పేర్కొన్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను రికవరీ చేయడంతో పాటు, ఘటనా స్థలంలో దాడికి సంబంధించిన విజువల్ వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు. ఈ కేసులో సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను భయభ్రాంతులకు గురిచేసే అవకాశం ఉందంటూ ఢిల్లీ పోలీసులతో పాటు మృతుడు సాగర్ ధంకర్ తండ్రి వేసిన అభ్యంతరాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే సుశీల్‌కు బెయిల్ నిరాకరిస్తున్నట్లు ధర్మాసనం తీర్పు వెలువరించింది.