ఉక్రెయిన్‌తో వివాదం.. మధ్యవర్తిగా మాజీ సీజేఐ చంద్రచూడ్‌ను నియమించిన రష్యా

  • ఉక్రెయిన్‌తో పెట్టుబడుల వివాదంలో మాజీ సీజేఐ చంద్రచూడ్‌ను నియమించిన రష్యా
  • ఉక్రెయిన్‌కు చెందిన 'ఓస్చాడ్‌బ్యాంక్' ఆస్తుల నష్టంపై వందల మిలియన్ డాలర్ల దావా
  • 1998 నాటి ద్వైపాక్షిక ఒప్పందం కింద విచారణ జరుపుతున్న త్రిసభ్య ధర్మాసనం
  • గతంలో రష్యా విజ్ఞప్తులను తిరస్కరించిన చంద్రచూడ్.. ఈసారి అంగీకారం
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన ప్రభుత్వ రంగ బ్యాంకు 'ఓస్చాడ్‌బ్యాంక్'‌తో నెలకొన్న పెట్టుబడుల వివాదంలో రష్యా తమ తరఫు మధ్యవర్తిగా (ఆర్బిట్రేటర్) భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్‌ను నియమించింది. ఈ వివాదంపై 1998లో రష్యా, ఉక్రెయిన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం కింద విచారణ జరుగుతోంది.

రష్యా సైనిక చర్యల కారణంగా డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, జపోరిఝియా ప్రాంతాల్లో తమ ఆస్తులకు, కార్యకలాపాలకు భారీ నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ ఓస్చాడ్‌బ్యాంక్ ఈ కేసు దాఖలు చేసింది. ముఖ్యంగా 2022 తర్వాత జరిగిన పరిణామాలతో వందల మిలియన్ డాలర్ల నష్టం జరిగిందని పరిహారం కోరుతోంది. ఈ మేరకు 2025 జులైలో వివాద పరిష్కారం కోసం రష్యాకు నోటీసులు పంపినా స్పందన రాకపోవడంతో అంతర్జాతీయ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.

ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు త్రిసభ్య ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇరు పక్షాల అంగీకారంతో కోస్టారికాకు చెందిన డయాలా జిమెనెజ్ ధర్మాసనానికి అధ్యక్షత వహిస్తున్నారు. ఉక్రెయిన్ బ్యాంకు తరఫున గ్రీక్ ఆర్బిట్రేటర్ స్టవ్రోస్ బ్రెకౌలాకిస్‌ను నియమించారు. ఇప్పుడు రష్యా తమ ప్రతినిధిగా జస్టిస్ చంద్రచూడ్‌ను ఎంపిక చేసింది. గతంలో ఇలాంటి ఇతర వివాదాల్లో రష్యా చేసిన విజ్ఞప్తులను జస్టిస్ చంద్రచూడ్ తిరస్కరించడం గమనార్హం. అయితే, ఈసారి ఆయన నియామకాన్ని అంగీకరించడంతో ఈ కేసుకు ప్రాధాన్యత ఏర్పడింది.
Advertisement

More Telugu News