పన్నుల బిల్లుకు పార్లమెంట్ ఆమోదం.. యూపీఐ ఛార్జీలపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Nirmala Sitharaman key announcement on UPI charges as Parliament approves Tax Bill
  • పన్నుల సవరణ బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం
  • యూపీఐ లావాదేవీలపై వినియోగదారులకు ఛార్జీలు లేవని నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ
  • మర్చంట్ డిస్కౌంట్ రేట్‌పై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదన్న కేంద్రం
  • భవిష్యత్తులో ఛార్జీలు వచ్చినా వ్యాపారులకే, అదీ పెద్ద లావాదేవీలకే వర్తింపు
  • రోజువారీ కొనుగోళ్లు 90 శాతం ఉచితంగానే కొనసాగుతాయని వెల్లడి
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై వినియోగదారులకు ఎటువంటి ఛార్జీలు లేదా పన్నులు విధించే ఉద్దేశం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో స్పష్టం చేశారు. పన్నుల, ఇతర చట్టాల (సవరణ) బిల్లు 2026కు పార్లమెంట్ ఆమోదం తెలిపిన సందర్భంగా ఆమె ఈ కీలక ప్రకటన చేశారు.

గత వారం లోక్‌సభ ఆమోదం పొందిన ఈ బిల్లును, సోమవారం రాజ్యసభ సైతం మూజువాణి ఓటు ద్వారా ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 10ఏకు చేసిన సవరణ కేవలం వెసులుబాటు కల్పించే నిబంధన మాత్రమేనని వివరించారు. ఈ సవరణ ద్వారా యూపీఐ వినియోగదారులపై ఎటువంటి లావాదేవీ ఛార్జీలు లేదా పన్నులు విధించడం లేదని ఆమె సభకు విస్పష్టంగా తెలిపారు.

మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధింపుపై వెలువడుతున్న ఊహాగానాలపై కూడా ఆమె స్పష్టతనిచ్చారు. పార్లమెంట్ ఆమోదం అనంతరం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) స్టీరింగ్ కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని, ప్రస్తుతం ఎటువంటి ఎండీఆర్ ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేయలేదని వెల్లడించారు.

భవిష్యత్తులో ఒకవేళ ఎండీఆర్‌ను ప్రవేశపెట్టినా, అది కేవలం నిర్దిష్ట పరిమితికి మించిన అధిక విలువ గల వ్యాపార లావాదేవీలకు మాత్రమే వర్తిస్తుందని ఆర్థిక శాఖ గతంలోనే స్పష్టం చేసింది. పాలు, కూరగాయలు, కిరాణా వంటి 90 శాతానికి పైగా రోజువారీ కొనుగోళ్లు వ్యాపారులకు కూడా ఉచితంగానే అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. 2016లో ప్రారంభమైన యూపీఐ, 2020 జనవరి నుంచి ఉచిత సేవలను అందిస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపు వ్యవస్థగా అవతరించింది.
Advertisement
Nirmala Sitharaman
UPI Charges
Taxation and Other Laws Amendment Bill 2026
NPCI
Merchant Discount Rate MDR

More Telugu News