మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారు.. లోకేశ్ రాజీనామా చేయాలి: రోజా డిమాండ్
- డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలన్న రోజా
- లంచాలు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణ
- ప్రధాని మోదీ స్పందించి చర్యలు తీసుకోవాలన్న రోజా
ఏపీ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని, దీనిపై తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలని మాజీ మంత్రి, వైసీపీ నేత రోజా డిమాండ్ చేశారు. వైసీపీ పిలుపు మేరకు నగరిలో చేపట్టిన మూడో రోజు రిలే నిరాహార దీక్షలో ఆమె మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ఈ అక్రమాలపై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. మెరిట్ ఉన్న అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, లంచాలు దండుకుని అనర్హులకు కట్టబెట్టారని తీవ్రంగా ఆరోపించారు.
ఈ ఘటనలపై మంత్రి నారా లోకేశ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ స్పందించి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ దీక్షా శిబిరాలపై కోడిగుడ్లతో దాడులు చేస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని రోజా మండిపడ్డారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన తిరుపతి, చిత్తూరు జిల్లాల వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ... డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించే వరకు నిరసనలు ఆపేది లేదని, తిరుపతిలో త్వరలోనే భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు.