తెలంగాణలో త్వరలో మద్యం ధరల పెంపు!

Telangana Government to increase liquor prices soon
  • ధరల సవరణపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన కమిటీ
  • మూడేళ్ల తర్వాత ధరల పెంపునకు సిద్ధమైన సర్కార్
  • 10 నుంచి 15 శాతం పెంపు కోరుతున్న మద్యం తయారీ సంస్థలు
  • పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణాపై ప్రభుత్వం ఆందోళన
మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్, మిడ్-రేంజ్, ప్రీమియం సహా అన్ని రకాల బ్రాండ్ల ధరలను పెంచేందుకు కసరత్తు చేస్తోంది. దీనిపై ఏర్పాటు చేసిన సబ్-కమిటీ, సవరించిన ఎంఆర్‌పీ ధరలతో కూడిన నివేదికను గురువారం ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను పరిశీలించిన తర్వాత ఎక్సైజ్ శాఖ తుది నిర్ణయం తీసుకోనుంది. ఆగస్టు 15 తర్వాత ఎప్పుడైనా కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రాష్ట్రంలో చివరిసారిగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో మద్యం ధరలను సవరించారు. నిబంధనల ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి ధరలను సమీక్షించాల్సి ఉన్నప్పటికీ, గత మూడేళ్లుగా పెంపుదల లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మద్యం తయారీ సంస్థలు (డిస్టిలరీలు) ప్రభుత్వానికి విన్నవించాయి. ముడిసరుకుల ధరలు, రవాణా ఛార్జీలు, సిబ్బంది జీతాలు, పన్నుల భారం గణనీయంగా పెరిగిందని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 'ధరల నిర్ణయ కమిటీ'ని ఏర్పాటు చేసి, డిస్టిలరీల ప్రతినిధులతో చర్చలు జరిపింది. పెరిగిన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని కమిటీ ఈ నివేదికను రూపొందించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో 10 నుంచి 15 శాతం వరకు ధరలు పెంచాలని డిస్టిలరీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ధరల పెంపు విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. మద్యం ధరలను భారీగా పెంచితే, పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల రాష్ట్ర ఆదాయానికి గండి పడుతుంది. అందుకే, పొరుగు రాష్ట్రాల్లోని ధరలతో పోల్చి చూసిన తర్వాతే పెంపుదల శాతాన్ని ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. సబ్-కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించి, త్వరలోనే ప్రభుత్వం తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది.
Advertisement
Telangana Government
Liquor Price Hike
Telangana Excise Department
Alcohol Prices Telangana
Liquor MRP Revision
Telangana Distillery Demands

More Telugu News