ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. పూర్తి వివరాలు ఇవిగో!

Andhra Pradesh massive IAS transfers full details here
  • ఏపీలో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీ
  • పలు కీలక శాఖలకు కొత్త కార్యదర్శుల నియామకం
  • కొంతమంది అధికారులకు పూర్తి అదనపు బాధ్యతల అప్పగింత
  • ఐఏఎస్ అమ్రాపాలి సహా కొందరికి పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశం
  • గోదావరి పుష్కరాలకు ప్రత్యేక, సంయుక్త ప్రత్యేక అధికారుల నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భారీ స్థాయిలో పరిపాలన ప్రక్షాళన జరిగింది. పెద్ద ఎత్తున ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు (జీవో ఆర్టీ నెం.1539) జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 

విద్యా, పర్యాటక, రవాణా, గృహనిర్మాణం వంటి కీలక శాఖలకు కొత్త అధిపతులు రాగా, కొందరు సీనియర్ అధికారులను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించడం గమనార్హం. మొత్తం 22 మంది అధికారులకు సంబంధించిన బదిలీలు, నియామకాలు, అదనపు బాధ్యతల వివరాలు కింది విధంగా ఉన్నాయి.

బదిలీలు, నియామకాల వివరాలు:

1. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సర్వీసెస్, హెచ్ఆర్ఎం), సాధారణ పరిపాలన శాఖలో పనిచేస్తున్న షంషేర్ సింగ్ రావత్‌ను బదిలీ చేసి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయనకు అదనంగా యువజన సర్వీసులు & క్రీడలు, సర్వీసెస్ & హెచ్ఆర్ఎం, జీపీఎం, ఏఆర్ విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) అప్పగించారు.

2. సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్న జె. శ్యామలరావును పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయనకు ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, జీఏడీ (పొలిటికల్) విభాగాల ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు.

3. పాఠశాల విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న కోన శశిధర్‌ను రవాణా, రోడ్లు-భవనాల శాఖ (TR, B) కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయనకు మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ కార్యదర్శిగా కూడా అదనపు బాధ్యతలు అప్పగించారు.

4. ఎస్జీ & ఎస్డబ్ల్యూ డైరెక్టర్‌గా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి ఎం. శివ ప్రసాద్‌ను ఏపీఎస్ఆర్టీసీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు ఆయన సర్వీసులను రవాణా శాఖకు అప్పగించారు. ఆయనకు ఎస్జీ, ఎస్ డబ్ల్యూ డైరెక్టర్ పోస్టుకు అదనపు బాధ్యతలు కొనసాగుతాయి.

5. ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న కాటా అమ్రపాలిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. తదుపరి పోస్టింగ్ కోసం ఆమెను సాధారణ పరిపాలన విభాగానికి (GAD) రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

6. ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న పట్టన్‌శెట్టి రవి సుభాష్‌ను ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయనకు సీఈవో (ఏపీటీఏ), ఏపీపీఎస్సీ కార్యదర్శి పోస్టులకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

7. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఎస్. సురేష్ కుమార్‌ను గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా నియమించారు. ఆయన తన ప్రస్తుత బాధ్యతలతో పాటు ఈ అదనపు విధులను నిర్వర్తిస్తారు.

8. ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌గా ఉన్న డాక్టర్ నారాయణ భరత్ గుప్తాను గోదావరి పుష్కరాల సంయుక్త ప్రత్యేక అధికారిగా నియమించారు. తన ప్రస్తుత విధులతో పాటు ఈ బాధ్యతలు అదనంగా చూస్తారు.

9. ఏపీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్‌గా ఉన్న ముత్యాలరాజు రేవును పురావస్తు, మ్యూజియంల కమిషనర్‌గా బదిలీ చేశారు. డిప్యూటీ సీఎం వద్ద ఓఎస్డీగా పునర్నియమితులైన కె. వెంకట కృష్ణకు రూరల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

10. సెకండరీ హెల్త్ డైరెక్టర్‌గా ఉన్న కేవీఎన్ చక్రధర బాబుకు ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ కమిషనర్, జాతీయ ఆరోగ్య మిషన్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు.

11. పోస్టింగ్ కోసం వేచి ఉన్న హెప్సిబా రాణి కొర్లపాటిని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఏపీ గృహ నిర్మాణ కార్పొరేషన్ వీసీ & ఎండీగా, ఏపీ బలహీన వర్గాల గృహ నిర్మాణ కార్యక్రమం కమిషనర్‌గానూ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

12. ఏపీ గృహ నిర్మాణ కార్పొరేషన్ వీసీ & ఎండీగా ఉన్న పి. అరుణ్ బాబును బదిలీ చేసి, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్‌గా నియమించారు. ఆయుష్ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

13. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (VMRDA) మెట్రోపాలిటన్ కమిషనర్‌గా ఉన్న ఎన్. తేజ్ భరత్‌కు పోస్టింగ్ ఇవ్వకుండా, సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

14. ఆర్‌టీజీఎస్ సీఈవోగా ఉన్న ప్రఖర్ జైన్‌ను వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా బదిలీ చేశారు.

15. ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీగా ఉన్న గీతాంజలి శర్మకు ఆర్‌టీజీఎస్ సీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

16. సీసీఎల్‌ఏ కార్యాలయంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న చేతన్ టీఎస్‌కు విపత్తుల నిర్వహణ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చారు.

17. టీటీడీ జేఈవో (హెల్త్, ఎడ్యుకేషన్)గా పునర్నియమితులైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ ఎ. శరత్‌ను టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించారు.

18. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ప్రభల గోపీనాథ్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవో (హెల్త్, ఎడ్యుకేషన్)గా నియమించారు.

19. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న ఏఏఎల్ పద్మావతిని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈవోగా నియమించారు.

20. పోస్టింగ్ కోసం వేచి ఉన్న ఎం. జయకృష్ణను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమించారు.

21. ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా ఉన్న బి. అనిల్ కుమార్ రెడ్డిని బాధ్యతల నుంచి తప్పించి, జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.

22. ఏపీ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఐఎఫ్ఎస్ అధికారి బి. సునీల్ కుమార్ రెడ్డికి ఏపీ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
Advertisement
Andhra Pradesh IAS Transfers
AP IAS Reshuffle
J Syamala Rao
Shamsher Singh Rawat
Amrapali Kata
AP Government Administration

More Telugu News